Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది మోడల్ సిటీ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎర్రగడ్డలోని గౌతమపురి కాలనీలోని ది మోడల్ సిటీ హైస్కూల్లో మహమ్మద్ రియాజ్ ఖాన్ అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే క్లాస్ చెప్పేటప్పుడు టీచర్ తబుస్సుమ్ బేగం మహమ్మద్ రియాజ్ ఖాన్ను బుక్ అడిగింది. కానీ అడిగిన బుక్కు బదులుగా రియాజ్ ఖాన్ వేరే బుక్ ఇచ్చాడు. దీంతో తుబుస్సుమ్ బేగం ఆగ్రహానికి గురైంది. చిన్నారి వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది.
ఇంటికి వెళ్లిన తర్వాత రియాజ్ ఖాన్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్కూల్ కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ది కావడంతో చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.