మన్సూరాబాద్, ఆగస్టు 26: కుక్కల బారి నుంచి రక్షించాలని కోరుతూ మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలోని హైదరాబాద్ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మంగళవారం కాలనీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సహారాస్టేట్స్ మెయింటెనెన్స్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జానీకి వినతి పత్రం అందజేశారు. కాలనీలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వీధి కుక్కల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో కుక్కలు గుంపులు, గుంపులుగా చేరి అరుస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయన్నారు. నడుచుకుంటూ, సైకిళ్లపై వెళ్తున్న విద్యార్థుల వెంట వీధి కుక్కలు పడుతున్నాయని కాలనీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. వీధి కుక్కలకు ఆహారం అందించే వారు కొంచెం ఆలోచించాలన్నారు.
కుక్కల బెడద నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. కాలనీ అధ్యక్షుడు సయ్యద్ జానీ మాట్లాడుతూ కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మేకల వెంకట్‌రెడ్డి, కాలనీవాసులు శీనయ్య, విశ్వనాథం, పాఠశాల ప్రిన్సిపాల్ రోజా రాణి, ఉపాధ్యాయులు ప్రశాంతి, రిజ్వాన, ఎస్కే సర్వీన్, రమా, స్వరూప, హానా జామీమా తదితరులు పాల్గొన్నారు.