షాద్‌నగర్, జూలై 10 : యజమాని రక్షణ చూసుకోవాల్సిన సంరక్షకుడే హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఫాంహౌజ్‌లో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్నది. షాద్‌నగర్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
హైదరాబాద్‌లోని హైదర్షకోట్ ప్రాంతానికి చెందిన కమ్మరి కృష్ణ (57) రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు చేశాడు. కొన్నేళ్ల కిందట కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూమిలో ఫాంహౌజ్‌ను నిర్మించుకొని, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. రోజువారీ మాదిరిగానే కమ్మరి కృష్ణ వ్యక్తిగత బాడీగార్డు బాబాతో కలిసి సాయంత్రం 5.30 గంటల సమయంలో టీ తాగారు.
ఆ తర్వాత బాబాతో పాటు మరో ముగ్గురు కలిసి కృష్ణపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. కుటుంబ సభ్యులు గమనించి.. తీవ్రంగా గాయపడిన కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణ వద్ద బాడీ గార్డ్డుగా పనిచేసే బాబానే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నదని ఏసీపీ రంగస్వామి తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. హత్య చేసిన అనంతరం దుండగులు కారులో పారిపోయారని, హత్యకు గల కారణాలు తమకు కూడా తెలియవని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.