సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్‌లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్‌లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా పబ్ నిర్వాహకులు రాత్రి 10 గంటల తర్వాత కూడా విపరీతమైన శబ్ధాలు చేస్తున్నారు.
సీపీ స్టీఫెన్ రవీంద్ర కథనం ప్రకారం.. సోమవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శరత్ సిటీ మాల్ (ఏఎంబీ)లో ఉన్న ఎయిర్ లైవ్ బార్ అండ్ రెస్టారెంట్ పబ్‌లో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం, పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా సింగర్స్ పాటలు, కీబోర్డు, డీజేలతో భారీ శబ్ధాలు చేస్తున్నారు. దీంతో నిర్వాహకుడు అతిన్ అగర్వాల్, మేనేజర్లు బుద్దాని వినీత్, బొక్కారి రాజు, గాయకుడు ఖాద్రీ అమన్, గిటారు ప్లేయర్ ఖాద్రీ ఉమర్, కీ బోర్డు ప్లేయర్ ఖాద్రీ బిలాల్, డ్రమ్స్ ప్లేయర్ దిప్ బెనర్జీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సౌండ్ సిస్టమ్స్‌ను స్వాధీనం చేసుకొని, ఎస్వోటీ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.