సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, నగర సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉదయం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో సతరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ఆలయ కమిటీ సభ్యులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, దేవాలయం పరిసరాలలో శుభ్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నో రోజులుగా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయాన్ని దర్శించాలనే కోరిక ఉండేదని, ఈ రోజు అది తీరిందని.. ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. పాతబస్తీలోని ఈ దేవాలయానికి చారిత్రక ప్రాముఖ్యతతో పాటు విశిష్టత కూడా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు హైదరాబాద్ నగర ప్రజలందరినీ కాపాడాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
అనంతరం నగర సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. ఆలయ కమిటీ సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాభారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ స్నేహ మెహ్రా, ట్రాఫిక్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.