సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గణేష్ నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో సాఫీగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ అధికారులకు సూచించారు. శుక్రవారం పాతబస్తీలోని పురానీ హవేలీ కార్యాలయంలో దక్షిణ మండలం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ ఆనంద్ పాల్గొని, గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తుపై చర్చించారు.
గతంలో నిమజ్జనం సమయంలో జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 5న మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం కోసం త్వరగా తరలించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించిన సీపీ.. ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా, ఎస్బీ డీసీపీ కె.అపూర్వరావు, ట్రాఫిక్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, టాస్ ఫోర్స్, సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.