Hyderabad | జనాల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. అమాయకపు ప్రజల నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
కొరియర్ పేరుతో మోసగిస్తున్న నేరగాడిని సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా పార్శిల్ పంపుతున్నామని తార్నాకకు చెందిన ఓ మహిళకు నిందితుడు ఫోన్ కాల్ చేశాడు. ఆ తర్వాత మీకు వచ్చిన పార్శిల్లో చట్ట వ్యతిరేక వస్తువులు ఉన్నాయని మరో కాల్ చేసి బెదిరించాడు. పోలీస్ కేసు కాకుండా ఉండాలంటే రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ మాటలతో భయపడిపోయిన సదరు మహిళ డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని యూపీకి చెందిన హర్షకుమార్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి కీలక విషయాలు సేకరించారు. నిందితుడు హర్షకుమార్కు చైనా సైబర్ నేరగాళ్లతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ మోసాల్లో హర్షకుమార్ చైనీయులకు సహకరిస్తున్నట్లు నిర్ధారించారు.
క్రికెట్ మ్యాచ్ టికెట్ల పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు
క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో విశాఖలో జరగబోయే భారత్-ఆసిస్ మ్యాచ్‌కు టికెట్లు ఇస్తానని రియాజ్ నమ్మించాడు. రియాజ్ మాటలు నమ్మిన ఓ బాధితుడు ఆన్లైన్లో రూ.5.26 లక్షలు పంపించాడు. ఒక్కసారి డబ్బు చేతికి అందడంతో స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు