Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 16 : మత్తుకు బానిసైన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లోనే గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని బేయిగ్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 401లో మహమూద్ అలీ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకునే మహమూద్ అలీ కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మంగళ్‌హాట్, ధూల్‌పేట నుంచి గంజాయి సీక్రెట్‌గా తెచ్చుకుని సేవించేవాడు. కానీ ఈ మధ్య డ్రగ్స్, గంజాయిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుండటంతో సులువుగా గంజాయి దొరకడం లేదు. దీంతో ఇబ్బంది పడిపోయిన మహమూద్ అలీ.. ఇంట్లోనే గంజాయి మొక్కను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆలోచన వచ్చిందో లేదో.. ఎలాగోలా ఒక గంజాయి మొక్కను సంపాదించాడు. దాన్ని పూలకుండీలో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. బాల్కనీలో గంజాయి మొక్కను పెంచుతూ తనకు అవసరమైనప్పుడల్లా వినియోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. పోలీసుల వరకు వెళ్లింది. దీంతో మహమూద్ అలీ ఫ్లాట్‌ను తనిఖీ చేసిన పోలీసులు గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.