మన్సూరాబాద్, మార్చి 1: కత్తితో బెదిరించి మహిళల బంగారు గొలుసులను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షల విలువైన 7 గ్రాముల బంగారు పుస్తెలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా, పెద్దకాకాని మండలం, వెనిగండ్ల గ్రామానికి చెందిన బనావత్ బాలాజీనాయక్ (25) హయత్‌నగర్, ఎల్లారెడ్డికాలనీలో నివాసముంటున్నాడు. అతడు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈస్ట్ గోదావరి జిల్లా, అమలాపురం, పెరూరుకు చెందిన చిట్టూరి రాజ్‌కిరణ్ (32) నగరంలోని ఫిరోజ్‌గూడ, బాగ్కాలనీలో నివాసముంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. 2019లో బాలాజీనాయక్, రాజ్‌కిరణ్ ఇద్దరు క్యాబ్ డ్రైవర్లుగా పని చేసే సమయంలో ఇద్దరికి స్నేహం ఏర్పడింది.
జల్సాలు, వ్యసనాలకు బానిసైన వారికి వచ్చిన డబ్బులు సరిపోలేదు. దీంతో భారీగా అప్పులు చేశారు. అప్పులు తీర్చడం కోసం సులువుగా డబ్బులు సంపాదించేందుకు మార్గం అన్వేషించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బంగారు ఆభరణాలను దోచుకునేందుకు పథకం వేశారు. గత నెల 27న ఒక బైకును అద్దెకు తీసుకున్న బాలాజీనాయక్, రాజ్‌కిరణ్ మధ్యహ్నం 3 గంటల సమయంలో హయత్‌నగర్ పీఎస్ పరిధి… లెక్చరర్స్‌కాలనీలో ఓ కిరాణా షాపు నడుపుతున్న మహిళను బాలాజీనాయక్ కత్తితో బెదిరించి బంగారు గొలుసును అపహరించాడు. ఇదే తరహాలో బొమ్మలగుడి వద్ద చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం డీమార్ట్‌కు వెళ్లి వస్తున్న శైలజ అనే మహిళను బైకుపై వచ్చి కత్తితో బెదిరించి బంగారు గొలుసును అపహరించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని వెళ్లారు.
బాధితుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్, ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం హయత్‌నగర్, బొమ్మరిల్లు సమీపంలోని ఎల్లారెడ్డికాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బాలాజీనాయక్, రాజ్‌కిరణ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దొంగతనం విషయం బయటపడింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి, హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్ పాల్గొన్నారు.