పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్‌పై స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, గ్యాస్ బంక్‌లకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేయడంతో నగరంలో సగానికి పైగా బంక్‌లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు బంక్‌లకు వివిధ రకాల రుణ సౌకర్యాలను కల్పిస్తాయి. అందులో భాగంగా డ్రాఫ్ట్ ఆన్ డెలివరీ అంటే డీలర్ ఆరోజు ముందు చేసిన కొనుగోలుకు ప్రతీ రోజు చివరిలో చెల్లిస్తాడు. రివాల్వింగ్ క్రెడిట్ దీని ప్రకారం బంక్‌లు 3-5 రోజుల వరకు ఇంధనాన్ని అరువుగా తీసుకొని ఆ తదుపరి రోజున చెల్లిస్తాయి. తాజాగా ఈ విధానాన్ని ఆయిల్ కంపెనీలు రద్దు చేశాయి. ముందు చెల్లించాకే.. ఇంధన సరఫరా అంటున్నాయి. దీంతో చాలా మంది డీలర్లకు ఏ రోజుకు ఆ రోజు నగదు నిర్వహణ కష్టతరమై బంక్ నిర్వహణపై చేతులెత్తేస్తున్నారు. ఇది ఇంధన సరఫరాపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నది. ఇంధన కొరత కారణంగా గ్రేటర్లో బంక్‌ల ముందర వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. గ్యాస్ కోసం ఆటోలు కిలో మీటర్ల మేర క్యూలో ఉండాల్సి వస్తున్నది. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదముందనే ఉద్దేశంతో ముందుగానే తమ వాహనాల ట్యాంక్‌లు ఫుల్ చేయించుకుంటున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ)

ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో నగరంలో ఇంధన కొరత ఆందోళన కల్గిస్తోన్నది. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డులు కన్పిస్తున్నాయి. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా బంక్‌ల వద్ద భారీగా రద్దీ నెలకొన్నది. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం విధితమే. తాజాగా పెట్రోల్ , డీజిల్ కొరత రావడంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూలు కట్టి ఫుల్‌గా పోయించుకుంటున్నారు. మరికొందరు డబ్బాలు తీసుకొచ్చి అందులో నింపుకుంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు తగ్గడంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌సెంటర్లు మూతపడగా…గత రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌ల వద్ద కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ఆటో వాలలు వాపోతున్నారు. సికింద్రాబాద్, దిల్‌సుక్‌నగర్, అమీర్‌పేట, సనత్‌నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్‌ల వద్ద ఆటోలు ఎల్పీజీ, సీఎన్జీ కోసం భారీగా క్యూ అయ్యాయి. ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరత ఉండడంతో నగరంలో వాహన ఎల్పీజీ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా ఇప్పుడు 90 రూపాయలు దాటిందని చెబుతున్నారు. బంక్ నిర్వాహకులు ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక ఇప్పటికే ఆటో వాలాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండగా తాజా గ్యాస్ కష్టాలు మరిన్ని ఇబ్బందులను తెచ్చాయి.