సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): పాత నగరం మెట్రో అలైన్మెంట్ మారింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సిన మెట్రో కారిడార్‌ను తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 5.5 కి.మీ మేర నిర్మించాల్సిన ఉన్న పాత నగరం మెట్రో మార్గాన్ని మరో 2 కి.మీ దూరం పొడిగిస్తూ కొత్త డీపీఆర్‌ను రూపొందించారు.
మొత్తం 7.5 కి.మీ దూరంతో నిర్మించే పాత నగరం మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.2300 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశలో చేపట్టనున్న మెట్రో మార్గాల్లో పాత నగరం మెట్రో, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రో మార్గాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ పాత నగరం మెట్రో కారిడార్‌కు రూ.500 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.100 కోట్లను కేటాయించారు.
ఈ రెండు కారిడార్లు ఇన్నర్ రింగు రోడ్డుపై చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానం అవుతుండటంతో అక్కడ ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్‌ను నిర్మించేలా డీపీఆర్‌ను రూపొందించారు. చాలా ఏండ్లుగా పెండింగులో ఉన్న పాత నగరం మెట్రో మార్గాన్ని ఇతర కారిడార్లతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఎంజీబీఎస్ -చాంద్రాయణగుట్ట మెట్రో మార్గాన్ని కారిడార్-4గా నిర్ణయించి డీపీఆర్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అందజేసేందుకు సిద్ధంగా ఉంది.
ఆస్తుల సేకరణకే రూ.వెయ్యి కోట్లు…
పాత నగరంలో నిర్మించే 7.5 కి.మీ మెట్రో కారిడార్‌లో భారీ ఎత్తున ఆస్తులను సేకరించాల్సి వస్తోందని మెట్రో అధికారి తెలిపారు. ప్రతిపాదిత మెట్రో మార్గంలో సుమారు 1100లకు పైగా ఆస్తులు ఉన్నాయని, వాటన్నింటినీ గుర్తించి పరిహారాన్ని చెల్లించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగం ఆస్తుల సేకరణకే వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత నగరంలో మెట్రో మార్గాన్ని నిర్మించే రోడ్డు విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటంతో ఆ మార్గాన్ని 60 నుంచి 80 అడుగుల మేర విస్తరించాలంటే ఆస్తుల సేకరణ ఎక్కువ మొత్తంలో చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా ఈ మార్గంలో యుటిలిటీస్ (విద్యుత్ స్తంభాలు, మంచినీటి లైన్లు, డ్రైనేజీ లైన్స్, కేబుల్స్)ను మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రూ.200 కోట్లు వ్యయం అవుతుందని మెట్రో అధికారి తెలిపారు. వీటికి తోడు మతపరమైన కట్టడాలు సైతం 100కు పైగా ఉండటంతో వీటికి ఎలాంటి ఆటంకం కలకుండా నిర్మాణాలు చేపట్టాల్సి ఉండటంతో చాలా సమయం తీసుకుంటుంది. అన్ని అడ్డంకులు దాటుకొని పాత నగరంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటే సుమారు రెండు నుంచి మూడేండ్లు పడుతుందనే అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.