పాతబస్తీ ప్రజల దశాబ్దాల మెట్రో కల నిరీక్షణలో మగ్గిపోతున్నది. ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అడుగులు పడకముందే, అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసి, కన్సల్టెన్సీల నియామకంపై హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఆసక్తి చూపడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. మెట్రో రెండో దశలో అత్యంత కీలకమైన ఎంజీబీఎస్-చాంద్రయణగుట్ట నిర్మాణంపై ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలే తప్పా… ఆచరణకు మాత్రం అడుగు ముందుకు పడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ): సుమారు 7.5 కిలోమీటర్ల పాతబస్తీ (ఎంజీబీఎస్-చాంద్రయణ్గుట్ట) కారిడార్ నిర్మాణానికి రూ.2,866 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ వంటి చారిత్రక కట్టడాల మీదుగా సాగే ఈ మార్గం సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైంది. అయితే ఈ మార్గంలో భూసేకరణ, భవనాల కూల్చివేత వంటి ప్రధాన అడ్డంకులను అధిగమించడంలో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడానికి తోడు కేంద్రం కొర్రీలు పాతబస్తీ మెట్రోపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
సాధారణంగా ఏదైనా భారీ ప్రాజెక్టుకు కేంద్రం, ఇతర శాఖల నుంచి ప్రాథమిక అనుమతులు వచ్చిన తర్వాతనే జనరల్ కన్సల్టెన్సీల నియామకం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు కొలిక్కి రాకముందే కన్సల్టెన్సీల వేటలో పడటంపై రవాణా రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ తయారీ, సంస్థాగత నిర్మాణంపై కన్సల్టెంట్ల సలహాలు కోరడం విడ్డూరంగా ఉంది. అసలు పట్టాలు పడకముందే, నిర్వహణ గురించి చర్చించడం అంటే గుర్రాన్ని బండి వెనుక కట్టిన చందంగా ఉందని విమర్శలు ఉన్నాయి. మెట్రో రైలు భద్రత కమిషనర్ నుంచి అనుమతులు పొందడంలో కన్సల్టెంట్ సాయం కోరడం అంటే ప్రాజెక్టు ఆలస్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని వాదిస్తున్నారు.
పాతబస్తీలోని ఇరుకైన రోడ్లు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై స్పష్టత లేదు. కన్సల్టెన్సీ వచ్చి అన్నీ చక్కదిద్దుతుందని అధికారులు కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ హబ్స్, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ వంటి అమలుకాని ప్రణాళికలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పునాది రాళ్లు వేయకుండానే ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందోనని పాతబస్తీ వాసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కన్సల్టెన్సీల నియామకంతో కాలయాపన చేయకుండా, ప్రభుత్వం తక్షణమే కేంద్రం నుంచి అనుమతులు, అవసరమైన నిధులను తీసుకువచ్చి ప్రాజెక్టును పూర్తిచేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.