సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో నిర్వహణ గందరగోళంగా మారింది. ప్రయాణికులు మెరుగైన రవాణా సదుపాయాలను అందించాల్సిన మెట్రో నిర్వహణ చోద్యం చూస్తోంది. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతుండటంతో మెట్రో ప్రయాణం అసౌకర్యంగా మారుతోంది. ముఖ్యంగా స్టేషన్ కారిడార్లు, మెట్ల మార్గాలన్నీ అధ్వాన్నంగా ఉంటున్నాయి. ఇక రైళ్లలో ప్రయాణికుల భద్రతపై నిత్యం ఫిర్యాదు వస్తూనే ఉన్నాయి. రద్దీ సమయాల్లో ఆకతాయిల వేధింపులతో మెట్రో ప్రయాణమే భయాందోళనలకు గురిచేస్తోంది.
నిత్యం మెట్రోలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నా.. నిర్వహణ విషయంలో యంత్రాంగం నిర్లక్ష్యం ఇప్పుడు మెట్రో రైళ్లకు దూరమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు బోగీలు పరిమితంగా సేవలు అందిస్తున్నాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నా… రద్దీతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 7-9గంటలలోపు, సాయంత్రం 6-7గంటలలోపు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో ఉన్న మూడు బోగీల్లో పరిమితికి మించి ప్రయాణించాల్సి వస్తోంది.
అయితే ఫ్రీక్వెన్సీ సర్దుబాటుపై మెట్రో సంస్థ దృష్టి పెట్టకపోవడంతో తోపులాటలతోనే ప్రయాణిస్తున్నారు. ఇక అదనపు బోగీలను సర్దుబాటు చేసే అంశం మరో ఏడాది వరకు వాయిదా వేసిన నిర్వహణ సంస్థ పనితీరుతో జనాలకు కిక్కిరిసిన ప్రయాణమే దిక్కైతుంది. పెరిగిన రద్దీతో మెట్రో రైళ్లలో భద్రత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా మహిళలకు కేటాయించిన బోగీలతోపాటు, జనరల్ బోగీల్లో జనాల మధ్య నిలబడాలంటేనే భయపడుతున్నారు. రద్దీ సమయంలోనే మహిళలకు ఆకతాయిల వేధింపులు గురవుతున్నారు.