సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : ఎల్ అండ్ టీ నుంచి మెట్రో టేకోవర్ అంశం తెరమీదకు రావడంతోనే నగరంలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. గడిచిన ఆరు నెలలుగా నిర్వహణ గాలికొదిలేశారు. ఇక పైలట్ ప్రాజెక్టుగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందించేలా మెట్రో నిర్వహణ సంస్థ రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను అందుబాటులో ఉంచింది. కానీ ఆరు నెలలు గడవక ముందే నైట్ సర్వీసులను నిలిపివేసింది. ఈ కారణంగా నగరంలో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు అనివార్యంగానే ఇతర ప్రైవేటు రవాణా సదుపాయాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
నగరంలో మెట్రో సేవల విస్తరణ గందరగోళంగా మారింది. మెట్రో టేకోవర్, అదనపు బోగీల ఏర్పాటు పేరిట కాలయాపన చేస్తుండగా, మెట్రో నిర్వహణ గాలికొదిలేశారు. ఎల్ అండ్ టీ మెట్రో నిర్వహణ సంస్థ కూడా ప్రయాణికుల మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తుండగా, టేకోవర్ చర్చల తర్వాత నిర్వహణ పూర్తిగా మరిచింది. దీంతో మొదటి దశ మెట్రో నిర్వహణ గందరగోళంగా మారితే, రెండో దశ మెట్రో విస్తరణ నీటి మీద రాతలుగా మారింది. ఇప్పటివరకు మెట్రో విస్తరణకు కేంద్రం అనుమతించకపోవడంతో అటు నిర్వహణ, ఇటు విస్తరణ లేక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో విపరీతంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందించాలనే లక్ష్యంతో రాత్రి 11.45 గంటలకు చివరి సర్వీస్‌ను తీసుకొచ్చారు. ఈ సర్వీస్ ద్వారా ఐటీ కారిడార్, పటాన్ చెరు, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల నుంచి నిత్యం రద్దీ 5.5లక్షలకు చేరుతుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇప్పటికీ రద్దీ బోగీలతోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనికోసమే రాత్రి సమయాల్లో కూడా మెట్రో సేవలు అందించేలా సర్వీసులను నడిపిన యంత్రాంగం… ఇప్పుడు వాటిని కూడా నిలిపివేసింది. అయితే రాత్రి పూట నడిచే సర్వీసుల్లో అనుకున్న స్థాయిలో ప్రయాణికులు రావడం లేదనీ చెబుతుండగా, దీనికి కారణాలను మాత్రం అన్వేషించడంలో అటు మెట్రో సంస్థ, నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ మరిచిపోయింది.
ప్రధానంగా ఐటీ కారిడార్ నుంచి రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు రాత్రి పూట కూడా మెట్రో కంటే ఎక్కువగా ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక చాలా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు పిక్ అండ్ డ్రాప్ సేవలు అందిస్తున్నాయి. అదే విధంగా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా కాలనీలకు వెళ్లేందుకు మరో రవాణా సేవలను ఆశ్రయించాల్సి వస్తుందనే చాలా మంది ప్రయాణికులు రాత్రి పూట మెట్రో సేవలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని మరిచిన యంత్రాంగం లాస్ట్ మైల్ కనెక్టవిటీని మెరుగుపరచకుండా, కేవలం నైట్ సర్వీసులను రద్దు చేసింది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే నైట్ సర్వీసులను 11గంటలకు కుదించింది. దీంతోనే నగరంలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నా… ప్రయోజనం లేకుండా పోతుందనే విమర్శలు వస్తున్నాయి.