హైదరాబాద్ మెట్రోకు జనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. నిత్యం 5.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. పీక్ అవర్స్‌లో తోపులాటలు సర్వసాధారణం. కానీ సర్కారు మాత్రం మెట్రో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రద్దీకి అనుగుణంగా బోగీలు పెంచుతామంటూ ప్రగల్బాలు పలికి రెండేండ్లు గడిచినా.. ఆ దిశగా ఒక్క అడుగు వేయలేదు.
– సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల విషయంలో అటు ఎల్ అండ్ టీ, ఇటు సర్కారు బంతాట ఆడుతూనే నగరంలో మెట్రో నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో బోగీలను పెంచాలనేది మెట్రో విధానంలో ఉంది. అయితే రద్దీ అనుకున్న దాని కంటే ఎక్కువే ఉంటున్నా… అదనపు బోగీల విషయంలో మాత్రం ఎల్అండ్టీ మెట్రో ఇప్పటీ వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే మెట్రో నిర్వహణ భారంగా మారిందని, నష్టాలు తప్ప.. ఆశించిన ఆదాయం రావడం లేదని మెట్రో నిర్వాహకులు బహిరంగంగా ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
దీంతో అదనపు బోగీలపై అటు ఎల్ అండ్ టీ, ఇటు హైదరాబాద్ మెట్రో ఊగిసలాడుతూనే ఉన్నాయి. నిజానికి అదనపు బోగీలను తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయాన్ని కోరుతూ ప్రతిపాదనలతో గతంలోనే ప్రభుత్వాన్ని కోరింది. కానీ సర్కారు బోగీల కంటే స్వాధీనానికి ప్రాధాన్యతనిచ్చి… మౌలిక వసతుల అంశాన్ని నీరుగార్చింది. కాగా, మెట్రో టేకోవర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మౌలిక వసతులకు దూరం చేస్తోంది. కనీసం పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఫ్రీక్వెన్సీ సర్దుబాటు చేసినా.. వందలాది మెట్రో ప్రయాణికలకు ప్రయోజనం ఉంటుంది. కానీ సర్కారు మాత్రం అటు బోగీలు పెంచకుండా, ఇటు మెట్రో సమయాన్ని సర్దుబాటు చేయకుండా జనాలను మాత్రం మెట్రో సేవలను పరిమితంగానే అందిస్తోంది.