చర్లపల్లి, ఫిబ్రవరి 22 : నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా వెన్నెంపల్లి గ్రామానికి చెందిన అరెల్లి మొగిలి(45) తన భార్య లావణ్యతో కలిసి సికింద్రాబాద్ లాలాపేట ఇందిరానగర్‌కు వచ్చి తన కుమారుడు సాయికుమార్(25), కూతురు శ్రావణితో కలిసి నివాసముంటున్నాడు. మొగిలి, సాయికుమార్ తండ్రీ కొడుకులు లాలాపేటల్లోని ప్యాకర్స్, మూవర్స్‌లో పని చేస్తున్నారు.
మొగిలి నిత్యం మద్యం తాగి పేకాట ఆడేందుకు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తున్నాడు. శనివారం ఉదయం మద్యంకు డబ్బులు ఇవ్వాలని భార్య, కుమారుడుతో మొగిలి గొడవ పెట్టుకున్నాడు. అనంతరం మొగిలి మధ్యాహ్నం బస్సులో ఈసీఐఎల్ చౌరస్తాకు వచ్చాడు. మానసికంగా విసిగిపోయిన కుమారుడు సాయికుమార్ ఎలాగైనా తన తండ్రి ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలని తనతో పాటు ఇంట్లో నుంచి తీసుకువచ్చిన కత్తితో ద్విచక్రవాహనంపై తండ్రిని వెంబడించాడు.
ఈసీఐఎల్ చౌరస్తాలో బస్సు దిగి రోడ్డుపైకి వచ్చిన మొగిలిని పోలీస్‌స్టేషన్ సమీపంలోనే కుమారుడు సాయికుమార్ విచక్షణ రహితంగా 15 చోట్ల కత్తితో పొడిచాడు. దీంతో స్థానికులు, ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు మొగిలి కుమారుడు సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని మొగిలిని మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్న ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మొగిలి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు.