Hyderabad | హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్లే.. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.
మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 120 రీడింగ్ నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా, మీన్‌రెడ్డి ఆత్మహత్యపై అతని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు.