సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ కోటా కింద ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ఎస్.ప్రభాకర్‌రావు పదవీ కాలం మే ఒకటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 4న ముగియనున్నది.
ఏప్రిల్7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం తొమ్మిదో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. ఆపై వచ్చే నెల 23న పోలింగ్ తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. వచ్చే నెల 25న కౌంటింగ్ చేపట్టనున్నారు. వచ్చే నెల 2న ఈ ఎన్నిక ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే హైదరాబాద్ నగర పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.