Hyderabad | హుస్సేన్‌సాగర్ కేవలం చారిత్రక జలాశయం మాత్రమే కాదు.. ఆధునిక పర్యాటక కేంద్రంగా బీఆర్ఎస్ సర్కార్ అద్భుతమైన డిజైన్లతో తీర్చిదిద్దుతున్నది. రాజమందిరంలాంటి రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం, సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన లేక్‌వ్యూ పార్కుతో ఆ ప్రాంతమంతా సరికొత్త శోభను సంతరించుకున్నది. సాగర తీరాన్ని సందర్శించే పర్యాటకులు సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు.
చారిత్రక నగరానికి తిలకం పెట్టినట్లుగా ఉండే హుస్సేన్‌సాగర్ ఇప్పుడొక పర్యాటక కేంద్రంగా మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలు కబ్జాలు, కంపు కొట్టే దుర్గంధం ఖైరతాబాద్ సిగ్నల్ వరకు వ్యాపించేది. కానీ బీఆర్ఎస్ సర్కార్ దశల వారీ అమలు చేస్తున్న ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో హుస్సేన్‌సాగర్ రూపురేఖలు మారిపోయాయి. గడిచిన మూడేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లను వెచ్చించి చారిత్రక వైభవాన్ని మరింత పెంచుతున్నది. ఓ వైపు పాలరాతి కట్టడాన్ని తలపించే నూతన సచివాలయ భవనం, ఎదురుగా అమరుల స్మారక చిహ్నం, ఆ పక్కనే దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంతో ట్యాంక్ బండ్ పరిసరాలు అమాంతం మారిపోయాయి. తాజాగా ఏర్పాటు చేసిన లేక్‌వ్యూ పార్క్ హుస్సేన్‌సాగర్ వైపు పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నది. జలాశయం చుట్టూ హైదరాబాద్ మహానగరం సరికొత్త సొబగులతో ముస్తాబవుతున్నది. సచివాలయం ఎదుట నిర్మించిన మ్యూజికల్ ఫౌంటెన్ నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాలు, విదేశీ పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో నూతన సచివాలయం కీలకంగా మారింది. అలాంటి సచివాలయం పరిపాలనకు కేంద్ర బిందువుగా మారుతున్నది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా హుస్సేన్‌సాగర్‌ను ఆట విడుపు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చుట్టూ ఉన్న వివిధ పార్కులను లక్షలాది మంది సందర్శిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ హెచ్ఎండీఏ ఇప్పటికే సుందరీకరణ పనులను పూర్తి చేసింది. చారిత్రాత్మక నేపథ్యం కనిపించేలా ట్యాంక్‌బండ్‌పై పలు భారీ కట్టడాలు చేపట్టారు. లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను కలుపుతూ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు పనులు చేపట్టారు. ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ అమరుల త్యాగానికి ప్రతీకగా నిలిచేలా స్మారక స్థూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, పీ.వీ.నరసింహారావు మార్గం (నెక్లెస్ రోడ్), సంజీవయ్య పార్కు, జలవిహార్, పీవీఘాట్, థ్రిల్ సిటీతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.
సాగర తీరంలో నిర్మించిన లేక్‌వ్యూ పార్కు ఆ ప్రాంతానికి మరింత వన్నె తీసుకువచ్చింది. లేక్ అందాలన్నీ కనబడే విధంగా లొకేషన్ తీరం, సాగర్ ఒడ్డున కూర్చుని సేద తీరేలా అబ్బురపరిచే ప్రవేశ ద్వారం, పాత్‌వేలు, పిల్లల కోసం ప్లే గ్రౌండ్, అందాలన్నీ ఆస్వాదించేలా అండర్‌పాస్, వాటర్ థీమ్ పార్కు, సాగర్ అలలపై నిలుచున్నట్లు గ్లాసు డెక్, ఫ్లోర్ స్క్రేప్, ఎలివేటెడ్ వాక్‌వే విత్ అండర్ పాసెస్, పెడస్ట్రియన్ ట్రయల్స్, మూడు మీటర్ల వెడల్పుతో వేవ్ వాక్, ఇన్నోవేటివ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నది..
…? కడార్ల కిరణ్