సిటీబ్యూరో, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): బంగారం వ్యాపారంలో పెట్టుబడులు కావాలంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని హయత్‌నగర్ (Hayathnagar) పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌తో పాటు నాగోల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోనూ ఆమెపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక కీలేడీ ముఠా ఉందని, అందులో నిందితురాలు సభ్యురాలేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నాగోల్ లలితనగర్కు చెందిన గన్నపురెడ్డి కవిత అలియాస్ కవితారెడ్డి (Kavitha Reddy) వృత్తిరీత్యా బోటిక్ వ్యాపారి.
చెన్నై నుంచి బంగారం తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నానంటూ నమ్మిస్తూ లక్షలు వసూలు చేయడంతోపాటు హయత్‌నగర్‌కు చెందిన వినోద్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తాను ఓ ఇన్స్పెక్టర్ భార్యనంటూ అందరిని బోల్తా కొట్టించిందని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు బెదిరిస్తుండటంతో బాధితులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కవితను అరెస్ట్ చేశారు. ఆమె గురించి ఆరా తీయగా.. పలు పోలీస్స్టేషన్లలోనూ ఆమెపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
వలపులతో వయస్సుతో సంబంధం లేకుండా పురుషులను లక్ష్యంగా చేసుకొని అందిన కాడికి దోచుకుపోయే ఓ ముఠాకు సంబంధించిన విషయం నాలుగు నెలల కిందట ఎల్బీనగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హానీ ట్రాప్ చేసి ఈ ముఠా దోచేస్తుంటుంది. ఈ ముఠాకు కొందరు పోలీసులతోనూ సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. స్నాచింగ్‌లు, మోసాలు చేయడం, వ్యభిచార వృత్తిలోనూ ఈ ముఠా సభ్యులు అరెస్ట్ అయ్యారు. వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడ్డ ఈ ముఠా సభ్యులపై నమోదైన కేసుల్లో కొన్ని రాజీ కుదిరించుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ ముఠాలో ఐదుగురు సభ్యుల వరకు ఉన్నట్లు సమాచారం. ముఠాలోని సభ్యులు ఒకరిద్దరు కలిసి హానీ ట్రాప్ చేస్తుంటారని సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన బంగారం వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించిన కేసుతో ఏమైనా లింక్ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హానీ ట్రాప్ చేసే ముఠాపై నాగోలు, హయత్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి ప్రాంతాల్లోనూ గతంలో కేసులు ఉన్నాయి. ఈ ముఠా వ్యవహారమంతా ఎల్బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హానీ ట్రాప్ ముఠాకు, తాజాగా అరస్టైయిన కవితకు సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తే మరింత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని బాధితులు సూచిస్తున్నారు.