చారిత్రక, వారసత్వ నగరమైన హైదరాబాద్ ఔనత్యాన్ని చాటేలా ఉన్న ఎన్నో కట్టడాలు, నిర్మాణాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రక్షణగా నిలుస్తున్నారు. చారిత్రక నిర్మాణ శైలి దెబ్బతినకుండా కట్టడాలను కాపాడేందుకు బీఆర్ఎస్ ఎంతగానో కృషి చేసింది. గడిచిన తొమ్మిదేండ్లలో పదుల సంఖ్యలో వారసత్వ కట్టడాలు, చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మాణాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెత్త కుప్పలుగా మారిన పురాతన కట్టడాలను గుర్తించి వాటిని ఆధునీకరిస్తోంది. ఫలితంగా వందల ఏండ్ల నాటి కట్టడాలు సరికొత్త కళను సంతరించుకుంటున్నాయి.
– సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)
వందల ఏండ్ల చరిత్ర ఉన్న నగరంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కూడిన కట్టడాలు, మసీదు, గుడులు, గోపురాలతోపాటుగా మెట్లబావులు, భవనాలకు కొదువే లేదు. కానీ ఘనమైన చరిత్రకు చిహ్నాంగా నిలిచే కట్టడాలు కాలక్రమంలో చెత్తకుప్పలుగా, పాడుబడిన బంగ్లాలుగా మారిపోయాయి. భావి తరాలకు చారిత్రక సంపద గొప్పతనాన్ని చాటిచెప్పే నిర్మాణాలను గడిచిన తొమ్మిదేండ్లలో నగరంలో 100కు పైగా కట్టడాలు, నిర్మాణాలు, మసీదుల, మెట్ల, చేద బావులతోపాటు, మహల్స్, టూంబ్స్‌ను ఆధునీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
గ్రేటర్ వ్యాప్తంగా బల్దియా, టూరిజం, హెచ్ఎండీఏతోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక కట్టడాలను పునరుద్ధరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50కిపైగా మెట్ల, చేద బావులను గుర్తించి… గడిచిన కొంత కాలంగా నగరంలోని బాపూఘాట్, గచ్చిబౌలి, గడి మల్కాపూర్, శివంబాగ్, బన్సీలాల్ పేట్, సీతారాం బాగ్తోపాటు 30కిపైగా మెట్ల, చేద బావుల ఆధునీకరణకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. వీటితోపాటు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు కూడా వారసత్వ కట్టడాలను పరిరక్షణకు ముందుకు రావడంతో 2014 నుంచి చారిత్ర కట్టడాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేసింది. సెవన్ టూంబ్స్‌లోని నవాబుల స్మారక సమాధులతోపాటు, మెట్ల బావులను ఆధునీకరించింది. దాదాపు 108 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కుతుబ్ షాహి టూంబ్స్‌లోని మెట్ల బావుల అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్వ వైభవానికి కృషి చేసింది. ఒకప్పుడు బన్సీలాల్ పేటలో ఉన్న మెట్ల బావి చెత్త కుప్పలా మారి శిథిలావస్థకు చేరితే… దానిని వెలికితీయడంతోపాటు, భూగర్భ జలాలను పరిరక్షించేలా అభివృద్ధి చేశారు. దీంతో ఈ బావి ప్రస్తుతం నగరంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.
7వ కుతుబ్ షాహి కాలానికి కంటే ముందే నిర్మించిన ముష్క్ మహల్ పాడుబడిన నిర్మాణంగా మారింది. అత్తాపూర్‌లోని రాంబాగ్ టెంపుల్ నుంచి నరసింహా స్వామి టెంపుల్‌కు వెళ్లే మార్గంలో ఉండే ఈ భవనాన్ని గుర్తించిన అధికారుల ఆధునీకరణపై దృష్టి సారించారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ సమీపంలో ఉండే సైదానీమా టూంబ్స్ పక్కన అతిపురాతనమైన బావికి హెచ్ఎండీఏ అధికారులు రీస్టోర్ చేయడంపై దృష్టి సారించింది. అదేవిధంగా అమీర్‌పేట్‌లోని సెస్ క్యాంపస్ ప్రాంగణంలో ఉండే అబ్జర్వేటరీని నిజాం కాలంలో నిర్మించగా.. ఆసియాలోనే అతిపెద్ద రెండో టెలిస్కోప్‌గా గుర్తింపు ఉంది. ఇలాంటి వాటిని స్థానికులు, చరిత్రకారులు, సామాజికవేత్తలు, పౌర సమాజం గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడాలు పర్యాటక క్షేత్రాలుగా నిలుస్తున్నాయి. ఇలా నగరంలో సర్దార్ మహల్, సెంట్రల్ లైబ్రరీ, మొజంజాహీ మార్కెట్లను నగరంలో పలు వారసత్వ కట్టడాలను గుర్తించి పునరుద్ధరించింది.