సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి ఉత్సవాలకు మహానగరం సిద్ధమైంది. పండుగకు ఒక్కరోజే సమయం ఉండడంతో ఇప్పటికే మండపాల నిర్వాహకులు గణేష్ విక్రహాలను మండపాలకు తరలించారు. కాగా గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మహానగరంలోని నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 20వేల మందికి పైగా పోలీసు బలగాలతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 8వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 3వేలకు పైగా, మల్కాజిగిరి పరిధిలో 5749మంది, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషరేట్ పరిధిలో 4వేలకు పైగా పోలీసు బలగాలతో గణేష్ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో సుమారు 32వేల వినాయక విగ్రహాలు, సైబరాబాద్ పరిధిలో సుమారు 12వేలు, మల్కాజిగిరి పరిధిలో 15వేలు, ఫ్యూచర్ సిటీ పరిధిలో 10వేల గణేస్ విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 9శాతం విగ్రహాలు పెరిగినట్లు పోలీసుల అంచనా.
ఈ నిబంధనలు తప్పనిసరి…
గణేష్ మండపాల నిర్వాహకులు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని పోలీసు అధికారులు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్, అగ్నిమాపక, విద్యుత్, శబ్ద కాలుష్యం, పర్యావరణ నిబంధనలను పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో మండపాల వద్ద కనీసం ఇద్దరు సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుద్ఘాతాలు వంటివి జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రతలు పాటించాలన్నారు. కాగా భద్రతా చర్యల్లో ఆధునిక ఏఐ ఆధారిత సాంకేతికతతో పాటు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
గణేష్ ఉత్సవాల సందర్భంగా నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలోని సున్నిత ప్రాంతాల్లో సుమారు 50వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోనే సుమారు 5వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ సుమతి తెలిపారు. ఇవి కాకుండా ప్రతి గణేశ్ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విగ్రహాల ఊరేగింపులు, భక్తుల రద్దీ, సున్నిత ప్రాంతాలు, అత్యవసర పరిస్థితులను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించి అవసరమైన ప్రాంతాలకు పోలీసు బలగాలను వేగంగా తరలించనున్నారు.
మల్కాజిగిరి పరిధిలో….
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎల్బీనగర్ ఎక్స్ రోడ్, హబ్సిగూడ ఎక్స్ రోడ్, రాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, మలాజిగిరి, నేరేడ్మెట్, ప్యారడైజ్, ప్యాట్నీ, మారేడ్ పల్లి, సీటీవో, రసూల్ పురా, వైఎంసీఏ, తిరుమలగిరి తదితర ప్రాంతాలను కీలక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 27 నిమజ్జన ప్రాంతాలను గుర్తించారు. చెరువులు, బేబీ పాండ్లు, తవ్విన ట్యాంకులు, పోర్టబుల్ ట్యాంకులను నిమజ్జనం కోసం సిద్ధం చేస్తున్నారు. శామీర్‌పేట్ లేక్, సరూర్‌నగర్ లేక్, రాంపల్లి లేక్, ఉప్పల్ బేబీ పాండ్, ఎడులాబాద్ ట్యాంక్, సఫిల్‌గూడ బేబీ పాండ్ తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 552 గణేశ్ మండపాల్లో 2,200 మంది సహచరి వాలంటీర్లు పోలీసులతో కలిసి పనిచేస్తూ భద్రత, క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణంపై అవగాహన కల్పించనున్నారు.
ఉత్సవాలకు వాహనాలు సిద్ధం
గణేష్ ఉత్సవాలకు ఆర్టీఏ అన్ని రకాల వాహనాలను సమకూర్చింది. ఆర్టీఓ కార్యాలయాల వారీగా వాహనాలను రెడీ చేశారు. మండప నిర్వాహకులు ఉత్సవ కమిటీ నాయకులతో సమన్వయం చేసుకొని వాహనాలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. సుమారు 60వేల వాహనాలు సమకూర్చారు. ఆర్టీఏ టారిఫ్‌ల ప్రకారం ఇంధనం, బత్తాతో సహా ట్రైలర్ల ఛార్జీలను రూ.33వేలుగా ఉంది. 12 టైర్లు గల భారీ సరుకు రవాణా వాహనాల ధర ఇంధనం మినహాయించి రూ. 4,500 కాగా, ఇందులో రూ. 500 డ్రైవర్, క్లీనర్ బత్తా కూడా కలిపి ఉంది. భారీ గూడ్స్ వాహనాలు (6 టైర్లు)కకు రూ.3వేలు, మీడియం గూడ్స్ వాహనాలు రూ.2వేలు, లైట్ గూడ్స్ వాహనాలు రూ.1500, టాటా ఏసీ లేదా చిన్న వాహనాలు రూ.వెయ్యిగా ఉన్నాయి. ఉత్సవ నిర్వాహకులు తమ ప్రాంత పరిధిలోని ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేసిన పూలింగ్ పాయింట్ల ద్వారా ఈ వాహనాలను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పోలీసులకు సహకరించండి: సీపీ సుమతి
గణేశ్ ఉత్సవ నిర్వాహకులు అన్ని మండపాలను నమోదు చేసుకుని పూర్తి వివరాలను పోలీసులకు అందించాలని మల్కాజిగిరి సీపీ సుమతి విజ్ఞప్తి చేశారు. మండపాల్లో నిర్వహించే వీఐపీ, వీవీఐపీ కార్యక్రమాలు, భారీ సాంసృతిక కార్యక్రమాల వివరాలను ముందుగానే తెలియజేయాలని, దీనివల్ల అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు. చెరువులు, బేబీ పాండ్ల వద్ద లైటింగ్, బారికేడింగ్, ఇతర సౌకర్యాలు కల్పించడంతోపాటు నిమజ్జన వాహనాల రాకపోకలకు రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. మలాజిగిరి కమిషనరేట్, సరూర్ నగర్, బేగంపేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పనిచేయనున్నట్లు తెలిపారు.