సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరిట హౌసింగ్ బోర్డు నగర ప్రజలతో ఆటలాడుకుంటున్నది. దరఖాస్తు ప్రక్రియ నుంచి లాటరీలో అర్హుల ఎంపిక దాకా అంతా గందరగోళమే చేస్తున్నారు. దరఖాస్తు దారుల్లో అర్హులను గుర్తించడంలో కుంటిసాకులు చూపి వేలాది మందిని అనర్హులుగా తేల్చేశారు. అర్హత సాధించి రూ.10 వేలు వెచ్చించి దరఖాస్తు చేసుకున్న వారిలోనూ ఎలిజిబిలిటీ పేరిట కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. తాజాగా లాటరీలో ఇల్లు వచ్చిందని బహిరంగంగా ప్రకటించి.. తూచ్.. మీకు ఇల్లు రాలేదని లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. లాటరీలో ఇల్లు వచ్చిందని చెప్పినవారికి రెండు రోజుల్లో మెసేజ్లు వస్తాయని ప్రకటించారు.
లాటరీలో పేరు వచ్చినా మెసేజ్లు రానివారు హౌసింగ్ బోర్డు అధికారులను సంప్రదిస్తే మీకు ఇల్లు రాలేదు… అందుకే మెసేజ్లు రాలేదని చెప్తుండటంతో బాధితులు షాకవుతున్నారు. వందల మంది సమక్షంలో లాటరీలో తమ పేరు వచ్చిందని చెప్పి.. ఇప్పుడు రాలేదని ఎలా చెప్తారని నిలదీస్తున్నారు. బాధితులంతా హౌసింగ్ బోర్డుకు వరుస కడుతున్నారు. దీంతో హౌసింగ్ బోర్డు సిబ్బంది మాత్రం.. అదంతా తమకు తెలియదని.. కంప్యూటర్లో మాత్రం మీకు రానట్లే చూపుతుందని తెగేసి చెప్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు వచ్చిన ఇండ్లను వేరే వాళ్లకు కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆది నుంచి గందరగోళమే
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించినప్పటి నుంచీ అంతా గందరగోళమే ఏర్పడుతున్నది. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత అనర్హులను వేరు చేసి.. అభ్యంతరాలు స్వీకరించారు. వారిలోనూ కొంతమందిని మళ్లీ అర్హుల జాబితాలో చేర్చారు. కానీ మొత్తంగా అనర్హులను తొలగించాక 60 వేల దరఖాస్తుల్లో అర్హత సాధించిన వారి జాబితా మాత్రం అధికారికంగా విడుదల చేయలేదు. ఎంతమంది అర్హత సాధించారో ప్రకటించకుండానే లాటరీ తీశారు. పథకం ప్రకటించినప్పటి నుంచి అన్ని విషయాలు ప్రకటనల రూపంలో విడుదల చేసి అర్హుల జాబితా విడుదల చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అదేవిధంగా పథకం ప్రకటించినప్పుడు క్యూర్ పరిధిలో ఎక్కడ నివసించేవారైనా ఏ నియోజకవర్గంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనల్లో చేర్చారు. కానీ లాటరీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ క్షేత్రస్థాయి తనిఖీల పేరిట ఏ నియోజకవర్గంలో నివసించేవారు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి అలా కాకుండా ఒక నియోజకవర్గంలో ఉంటున్నవారు మరో నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకుంటే లాటరీలో పేరు వచ్చినా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లాటరీలో పేరు వచ్చిన వారిని కూడా ఇల్లు రాలేదని తేల్చేస్తున్నారు. ఈ తతంగమంతా చూస్తుంటే ఏదో జరుగుతుందని లబ్ధిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకే స్పష్టత లేకపోవడంతో అనర్హులకు కేటాయించే కుట్ర చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా హౌసింగ్ బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
లాటరీలో పేరు.. జాబితాలో మాయం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది అంబర్పేట ఓవైసీనగర్కు చెందిన ఆశాబేగం, షేక్ ఫరీద్ దంపతులు. ఏండ్ల తరబడిగా అద్దె ఇంట్లో ఉం టున్నారు. రూ.10 వేలు వెచ్చించి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 29న అంబర్పేట నియోజకవర్గానికి లబ్ధిదారు ల ఎంపిక చేపట్టారు. లక్కీ డ్రాలో ఆశాబేగం (అప్లికేషన్ నంబర్ 147463) పేరు వచ్చింది. దీంతో ఆ దంపతులు సంతోషంలో మునిగితేలారు. లాటరీలో పేరు వచ్చిన వారి ఫోన్కు రెండు రోజుల్లో అలాట్మెంట్ మెసేజ్ వస్తుందని అధికారులు చెప్పారు. కానీ పది రోజులైన వారికి మెసేజ్ రాలేదు. దీంతో వారు హౌ సింగ్ బోర్డు అధికారులను సంప్రదించారు. వాళ్లు వెబ్సైట్లో చెక్ చేసి అసలు ఆశాబేగం పేరిట ఇల్లు రాలేదని తేల్చేశారు. దీం తో వాళ్లు షాక్కు గురయ్యారు. దీంతో ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితి నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తున్నది.