కోల్కతా, సెప్టెంబర్ 12: బ్యాంక్ డిపాజిట్లు గత నెలలో పెద్ద ఎత్తున పెరిగాయి. ఆగస్టులో 17.8 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన దశాబ్దకాలంలోనే ఇది గరిష్ఠం కావడం గమనార్హం. అయితే గల్ఫ్ వార్ నేపథ్యంలో తరిగిపోతున్న ఫారెక్స్ (డాలర్) నిల్వల దృష్ట్యా విదేశీ మదుపర్లను ఆకట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేకంగా చేపట్టిన ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) లేదా ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్లు కలిసొచ్చాయి.
కేవలం రెండున్నర నెలల్లోనే ప్రవాస భారతీయులు విదేశీ కరెన్సీ ఆధారిత నాన్-రెసిడెంట్ డిపాజిట్లలో 126 బిలియన్ డాలర్లు పెట్టారు. దీంతో గతంలో ఒక నెలలో డిపాజిట్ల వృద్ధికి సంబంధించి ఉన్న 15.4 శాతం రికార్డు కనుమరుగైపోయింది. కాగా, ఎఫ్సీఎన్ఆర్-బీ ద్వారా 48.5 శాతం డిపాజిట్లు ఐదేండ్ల కాలపరిమితికిగాను వచ్చినవేనని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా తెలిపారు. మరో 42 శాతం మూడేండ్లకుగాను, మిగతావి నాలుగేండ్లకుగాను ఉన్నాయన్నారు. ఇక ఆగస్టు 31తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంక్ డిపాజిట్లకు నికరంగా మరో రూ.9.4 లక్షల కోట్లు జత కలిశాయి. దీంతో మొత్తం రూ.278.7 లక్షల కోట్లకు చేరాయి.
దేశీయంగా బ్యాంకుల్లోకి డిపాజిట్ల రాక బాగా పడిపోయింది. దీంతో బ్యాంకులను నిధుల కొరత వేధిస్తున్నది. ఎఫ్సీఎన్ఆర్-బీతో భారీ ఉపశమనమే లభించినా.. స్థానిక మదుపర్లు మాత్రం రాబడుల కోసం మార్కెట్ ఆధారిత సాధనాలనే నమ్ముకుంటుండటం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఒకింత కలవరపెడుతున్నది.
చివరకు సంప్రదాయ మదుపర్లు సైతం సురక్షిత పెట్టుబడి సాధనాలైన బ్యాంక్ డిపాజిట్లను కాదని, ఒడిదుడుకులకు నిలయమైన ఈక్విటీ పెట్టుబడులపైనే అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రుణ వృద్ధి ఏడాది క్రితంతో పోల్చితే గత నెల 19.1 శాతంగా ఉన్నది. జూలై ఆఖరుతో చూస్తే 19.4 శాతంగా కనిపిస్తున్నట్టు ఆర్బీఐ చెప్తున్నది. రుణ బకాయిలు రూ.223.9 లక్షల కోట్లుగా, క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 80.32 శాతంగా నమోదైంది.