గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో పట్టపగలే చోరీ ( Theft ) జరిగింది. గ్రామానికి చెందిన తంబాళి నాగరాజు ( Nagaraju ) ఇంట్లోకి గుర్తుతెలియని దొంగ చొరబడి రెండు తులాల బంగారు( Gold ) ఆభరణాలతో పాటు రూ.90 వేల నగదును ఎత్తుకెళ్లాడు .
చోరీ జరుగుతున్న సమయంలో స్థానికులు అక్కడికి రావడాన్ని గమనించిన దొంగ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పారిపోయే క్రమంలో దొంగ తన వెంట తెచ్చుకున్న బైక్ను ఇంటి ముందే వదిలేసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇంటి పరిసరాలను పరిశీలించిన పోలీసులు చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరించారు. దొంగ వదిలి వెళ్లిన బైక్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. చోరీకి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.