న్యూఢిల్లీ: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం విమానంలో ప్రయాణించాడు. అయితే ఆ విమానం గాలిలో ఉండగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న ముగ్గురు డాక్టర్లు వెంటనే స్పందించారు. అత్యవసర చికిత్స అందించి అతడి ప్రాణాలు కాపాడారు. (Doctos Save Passenger) దేశ రాజధాని ఢిల్లీ నుంచి మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు బయలుదేరిన విమానంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉండగా అతడి ఆక్సిజన్ స్థాయిలు 40 శాతానికి పడిపోవడంతో తీవ్ర అస్వస్థత చెందాడు. ఊపిరి అందక తీవ్ర ఇబ్బందిపడ్డాడు.
కాగా, ఆ ప్రయాణికుడి పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వైద్య సహాయం కోసం ఎనౌన్స్మెంట్ చేశారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న జనరల్ సర్జన్ డాక్టర్ విల్లీ లాల్హ్రుయిట్లుంగా, పీడియాట్రిషియన్ డాక్టర్ ఎఫ్ రెమ్థాంగ్పుయి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బెంజమిన్ ఖియాంగ్టే వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి అత్యవసర చికిత్స అందించారు. తొలుత మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించగా ఆక్సిజన్ స్థాయిలు 60 శాతానికి చేరాయి. స్టెరాయిడ్లు ఇవ్వడంతో ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం మేర మెరుగుపడ్డాయి.
మరోవైపు ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆ విమానాన్ని కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని పైలట్లు తొలుత భావించారు. అతడి ఆక్సిజన్ స్థాయిలు తాత్కాలికంగా స్థిరపడటంతో ఐజ్వాల్‌కు ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే కొంతసేపటి తర్వాత ఆ ప్రయాణికుడి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో వైద్యులు ఇంట్యూబేషన్ చేయాలని భావించారు. విమానంలో అత్యవసర పరికరాలు పరిమితంగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని ఐజ్వాల్ విమానాశ్రయ సిబ్బందిని అలెర్ట్ చేశారు.
కాగా, ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే అక్కడ సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లోకి ఆ ప్రయాణికుడిని ఎక్కించారు. ఇంట్యూబేషన్ సెట్, ఎండోట్రాకియల్ ట్యూబ్ అందుబాటులో ఉండటంతో వైద్యులు ఇంట్యూబేషన్ చేశారు. అత్యవసర చికిత్సను కొనసాగించారు. అలాగే ఆ డాక్టర్లు ఐజ్వాల్‌లోని ఆసుపత్రులను సంప్రదించారు. చివరికి ఎల్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో ఒక ఐసీయూ బెడ్ అందుబాటులో ఉండటంతో ఆ రోగితో పాటు ఇద్దరు వైద్యులు అక్కడకు వెళ్లారు. ఆ ప్రయాణికుడికి ఎక్స్ట్యూబేషన్తో పాటు డయాలసిస్ చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది.
అయితే ఆ రోగితో పాటు అంబులెన్స్‌లో వెళ్లిన ఇద్దరు వైద్యులు తమ లగేజ్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేశారు. మరో డాక్టర్ అయిన బెంజమిన్ ఖియాంగ్టే వారికి సహాయం చేశారు. ఆ ఇద్దరు డాక్టర్ల లగేజ్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారు.