తొర్రూరు, అక్టోబర్ 05 : ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన రెవెన్యూ శాఖలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చర్చనీయాంశంగా మారాయి. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.వెయ్యి నుండి మూడు వేల వరకు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అనంతరం సంబంధిత కార్యాలయాలను ఆశ్రయించినప్పుడు డబ్బులు చెల్లిస్తే పనులు సులభంగా పూర్తవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్లపై సంతకాల విషయంలోనూ డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సేవ చేయాల్సిన వ్యవస్థలో ఈ వసూళ్లెందుకు?
ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందాల్సిన సర్టిఫికెట్ల కోసం సామాన్య ప్రజలు అదనపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై అవగాహన కల్పించాల్సిన అధికారులు.. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తులను తిరస్కరించడం, తిరిగి కార్యాలయాల చుట్టూ తిప్పడం, అనంతరం అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
మండల స్థాయిలో ప్రజల నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. నిజంగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయా? లేక ఆరోపణల్లో వాస్తవం లేదా? అనే విషయాన్ని అధికారులు పారదర్శకంగా తేల్చాలని కోరుతున్నారు.
మీ సేవలో దాఖలైన దరఖాస్తులు, తిరస్కరణకు గురైన సర్టిఫికెట్లు, జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.