సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): బహుముఖ రూపాలతో గణనాథులు సందడి చేశారు. భక్తుల సృజనకు ప్రతీకగా విభిన్న రూపాలలో నగరంలో కొలువుదీరిన గణపయ్య నిమజ్జనం మంగళవారం కోలాహలంగా సాగింది. తమ ఇష్టదైవాన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీ ఊరేగింపుగా కదిలి వచ్చారు. సంగీత వాయిద్యాలు, తీన్మార్ దరువులు.. బూరల శబ్దాలు, యువ కేరింతలతో ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడింది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల వేషధారణలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చే బహురూప వినాయకులను దర్శించుకునేందకు భక్తులు తరలిరావడంతో హుస్సేన్ సాగర్ తీరం జన సంద్రమైంది. డీజేల సందడి పెద్దగా కనిపించలేదు.
నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా జరిగింది. ఎల్బీనగర్, చార్మినార్, రామంతాపూర్, ఉప్పల్ తదితర చోట్ల నిమజ్జనానికి తరలిన గణనాథులకు గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వీడ్కోలు పలుకుతూ అడుగడుగునా భక్తులు నీరాజనాలు సమర్పించారు. నగరంలో 60 చోట్ల ఏర్పాటు చేసిన ఉత్సవ సమితి వేదికలపై స్వామీజీలు, ప్రముఖులు పాల్గొని తమ సందేశాలు అందించారు. చార్మినార్, ఎంజే మార్కెట్ వద్ద ఉత్సవ సమితి వేదికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, స్వామీజీలు ఉజ్జయిని దీపాంకర్, కమలానంద భారతి ప్రసంగించారు. ఎంజే మార్కెట్ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణపతులకు సమితి ప్రతినిధులు రాఘవరెడ్డి, రాజవర్థన్ రెడ్డి, రావినూతల శశిధర్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.
విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించడంతో నగరవాసులు సకలం కుటుంబ సమేతంగా ట్యాంక్‌బండ్‌కు విచ్చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉదయమే భారీగా జనం తరలొచ్చారు. భక్తులు పలు రకాల వాహనాలు, ఇంకొందరు పల్లకీలలో విగ్రహాలను తీసుకొచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రైవేటు వ్యక్తులు సేవలు అందించారు. నిమజ్జన వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తాయి. కళాకారులు ఆట, పాటలతో సందడి చేశారు. కోలాటం ఆడుతూ గణపయ్యను గంగ ఒడికి చేర్చారు. నిమజ్జనం సందర్భంగా చాలా మంది తినుబండారాలు విక్రయించే వారికి వ్యాపారం కలిసొచ్చింది. ఫుడ్ స్టాల్స్ గిరాకీతో కళకళలాడాయి. ఇంకొందరూ టాటూ షాపులు ఏర్పాటు చేయడంతో అవి కూడా నిండుకున్నాయి.
అందరి చూపు.. సచివాలయం, అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహంపైనే అధికంగా ఉన్నాయి. ఈ నిర్మాణాల ముందు సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రధానంగా స్మారక స్థూపం అద్దంలా మెరుస్తుండటంతో గణనాథుల యాత్ర, భక్తుల ప్రతిబింబాలు అందులో దర్శనమిస్తున్న దృశ్యాలను మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మురిసిపోయారు. జయహో కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సాఫీగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రాత్రి 8 గంటల వరకు 1,02,510 గణనాథుల విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 71 ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 విగ్రహాలు, ట్యాంక్‌బండ్ ఎన్నీటార్ మార్గ్‌లో 4,730, నెక్లెస్ రోడ్డు 2,360, పీపుల్స్ ప్లాజా 5,230, అల్వాల్ కొత్త చెరువులో 6,211 విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు.