సిటీబ్యూరో, ఆగస్ట్ 13 (నమస్తే తెలంగాణ): నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ వికాస్(21), టోనీ(20) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.
అఖిల్ అనే మరో యువకుడికి చికిత్స కొనసాగుతున్నదని వైద్యులు చెప్పారు. టోనీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, రాత్రి 11 గంటలకు విగ్రహం తీసుకురావడానికి చాంద్రాయణగుట్ట నుంచి జలపల్లికి వెళ్లారని టోనీ సోదరుడు బన్నీ చెప్పాడు. జల్పల్లిలో గణేశ్ విగ్రహం తీసుకుని చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు వెళ్తుండగా.. రాత్రి పన్నెండుగంటల సమయంలో చాంద్రాయణగుట్ట-బండ్లగూడ రోడ్డు రాగానే విద్యుత్‌తీగలు తగిలాయని పేర్కొన్నారు.
తనతో పాటు మరో ఫ్రెండ్ అఖిల్, త్యాగి ఉన్నారని, కరెంట్‌షాక్ తగలగానే ట్రాక్టర్ వెనక టైర్లు టోనీ మీద నుంచి వెళ్లాయని ఆయన తెలిపారు. టోనీ అక్కడికక్కడే చనిపోగా తాను ట్రాక్టర్‌పైనుంచి దూకేశానని మృతుడి సోదరుడు తెలిపారు. ప్రమాదంలో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.