రంగారెడ్డి, జూన్ 10 : ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితమైంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని (FCDA) ప్రకటించి ఏడాది కావస్తుంది. గత మార్చిలో ఎఫ్‌సీడీఏ కోసం 90 మంది ఉద్యోగులతో పోస్టులను కూడా ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పటివరకు ఉద్యోగులను సమకూర్చుకోవడంలో డెవలప్మెంట్ అథారిటీ అడుగులు ముందుకు వేయడం లేదు. ఇంటర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని నగర శివాలలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేశారు. కేటాయించిన 90 పోస్టుల్లో 34 రెగ్యులర్ పోస్టులు కాగా, 56 ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు నియమించుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించలేదు. దీంతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూర్, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్ మండలాల పరిధిలోని 56 గ్రామాలను కలిపి ఫ్యూటర్ సిటీని ప్రకటించింది. ఓఆర్ఆర్, కొంగరకలాన్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో ఫ్యూచర్ సిటీని నెలకొల్పాలని భావించింది. అలాగే నాగార్జునసాగర్- శ్రీశైలం రహదారి మధ్యలో 785 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి అవసరమైన భూములు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం ఇక్కడే మొగ్గు చూపింది. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలకు తోడు మరో పదహారువేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి ఎలా వాడుతారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటికో ఉద్యోగంపై స్పష్టత లేదు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట చొప్పున ఇళ్ల స్థలం ఇస్తామని ప్రకటించి ఇంతవరకు ఇవ్వలేదు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణాల్లో భాగంగా ప్రభుత్వం మొట్టమొదట ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి ఆమనగల్ మండలంలోని ఆకుతోటపెళ్లి వరకు 330 ఫీట్ల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. కానీ భూమి ఇవ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. దీంతో భూ సేకరణ కోసం వచ్చిన అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని రైతులు కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూసేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలోనే నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని నెలకొల్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీలో ఐటీ పారిశ్రామిక, పర్యాటక, క్రీడ రంగాలతోపాటు మరెన్నో విదేశీ కంపెనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం రూపకల్పన పూర్తిగా హెచ్ఎండీఏకి అప్పగించింది. అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు..
గత మార్చిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రకటిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌ను నియమించింది. అలాగే 90 ఉద్యోగాలను కేటాయించింది. ఇందులో 34 రెగ్యులర్ పోస్టులు కాగా, 56 మందిని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. అయితే రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఫ్యూచర్ సిటీ పురోగతి లేకపోవడం, ఎలాంటి పనులు ప్రారంభించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ మాత్రం పుంజుకోలేదు. ఫ్యూచర్ సిటీ వస్తుందని ముందుగానే భూములు కొనుగోలు చేస్తారని పెద్ద ఎత్తున ఆశించినప్పటికీ క్రయవిక్రయాలు ఏమాత్రం జరగడం లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వారు కూడా నిరాశలోనే ఉన్నారు.