సిటీబ్యూరో/ డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తూ..పట్టుపడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఈఎస్ కృష్ణప్రియ కథనం ప్రకారం.. శంషాబాద్, రాయల్ విల్లాస్ ప్రాంతానికి చెందిన ఎం.జిమ్యా నాయక్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్. బుద్వేల్‌కు చెందిన బండారి లింగయ్య అదే పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
వీరిద్దరూ విమానాశ్రయంలోని పోలీసు ఔట్‌పోస్టులో వీఐపీ ప్రొటోకాల్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిమ్యానాయక్కు ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ మద్యం దుకాణం బిల్లంగ్ కౌంటర్లో పనిచేసే మహేశ్వర్‌తో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్‌ల మీద ప్రతిరోజూ 10నుంచి 20వరకు డ్యూటీ ఫ్రీ మద్యాన్ని కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
శంషాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిలు తమ బృందంతో కలిసి కానిస్టేబుల్ జిమ్యా నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద మద్యం కొనుగోలు చేసిన మాదాపూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గీధర హరీశ్‌కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకుని గౌలిదొడ్డికి చెందిన రాఘవేంద్రరావుకు గోల్డ్లేబుల్ బాటిళ్లు విక్రయించినట్లు కానిస్టేబుల్ విచారణలో వెల్లడించడంతో అతడి కారును తనిఖీ చేయగా 8 గోల్డ్ లేబుల్ మద్యం బాటిళ్లు లభించాయి. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో కేసులో డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తున్న ఆర్జీఐఏ హోంగార్డు బండారి లింగయ్యను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.