సిటీబ్యూరో : గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లాకు సమీపంలో ఏర్పడిన భూకంప తరంగాలు నగరం వరకు విస్తరించాయి. భూమి ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతున ఏర్పడిన భూకంప కేంద్రంతో నగరంలోని యూసుఫ్‌గూడ, రహ్మత్ నగర్, బోరబండ, ఇబ్రహీంపట్నంతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు సిటీ జనాలు పేర్కొన్నారు. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో ములుగు జిల్లాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్ వరకు ప్రకంపనలు విస్తరించింది. ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
గోదావరి పరివాహాక ప్రాంతాల్లో భూమి అడుగున ఉండే పొరలు తరచూ సర్దుబాట్లకు గురవుతుంటాయని అందుకే భూకంపాలు వస్తాయని సైంటిస్టులు వివరించారు. భూమిలో ప్రధానంగా 16 రకాల పలకలు ఉంటాయి.. నిత్యం వివిధ దిశల్లో ప్రయాణిస్తుంటాయి. భారతదేశం ఉన్న ఫలకం ఉత్తర దిశలో ఏటా 5-6 సెం.మీటర్లు పయనించి ఆసియా పలకలతో ఢీకొంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏర్పడే ఒత్తిడి కారణంగా భూమి లోపల పొరల మధ్య కదలికలు వచ్చి భూకంపం సంభవిస్తుందన్నారు. తరంగాలు చుట్టూరా వందల కిలోమీటర్ల విస్తరించడంతో ఇతర ప్రాంతాల్లోనూ భూమి కంపిస్తుందని పేర్కొన్నారు. 55 ఏండ్ల కిందట భద్రాచలంలో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత కలిగిన ప్రకంపనలు రాగా, తాజాగా 5.3 మ్యాగ్నిట్యూడ్ భూకంపం రెండో అతిపెద్దదిగా పరిశోధకులు పేర్కొన్నారు. అయితే తెలంగాణకు భూకంపాలతో వచ్చే ప్రమాదం తక్కువేనని, ఈ ప్రాంతం సెస్మిక్ జోన్-2లో ఉన్నట్లు చెప్పారు.