సిటీబ్యూరో: డ్రగ్ మాఫియా డాన్ షేక్ ఫైసల్‌ను ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులను సైతం అరెస్టు చేసి వారి నుంచి 4.62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం-బీ ఈఎస్ కె. ప్రదీప్‌రావు కథనం ప్రకారం..అంబర్‌పేటలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున ట్రబ్‌నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో ఉన్న నలుగురి వద్ద 4.62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించింది.
కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, కొంత కాలంగా డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తూ పోలీసులకు దొరకకుండా, మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న డ్రగ్స్ మాఫియా డాన్ షేక్ ఫైసల్‌గా గుర్తించారు. కాగా, నిందితులు బెంగళూరులో గ్రాము రూ.1500 చొప్పున కొనుగోలు చేసి, నగరంలో గ్రాము ఎండీఎంఏను రూ. 8వేల నుంచి రూ.10వేలకు విక్రయిస్తున్నారని, ప్రస్తుతం బెంగళూరు నుంచి సుమారు 20 గ్రాముల ఎండీఎంఏ తీసుకొచ్చి నగరంలో విక్రయాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ సరఫరా కేసులో ఇటీవలే ఫైసల్ భార్య మస్రత్‌ను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.