అమీర్‌పేట్, డిసెంబర్ 16 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వసతుల లేమితో ఉనికి కోల్పోయిన సనత్‌నగర్ నెహ్రూ పార్కు, ఇప్పుడు మల్టీ జనరేషన్ థీమ్ పార్క్‌గా సరికొత్త రూపు సంతరించుకోవడం జరిగిందని, సనత్‌నగర్ ప్రజల అవసరాలు గుర్తించి ఆ మేరకు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి జెక్కాలనీ పార్కుతో పాటు సనత్‌నగర్ ఎస్ఆర్టీ క్వార్టర్స్‌లో రూ. 1.9 కోట్లతో రూపుదిద్దుకుంటున్న మల్టీ జనరేషన్ థీమ్ పార్కు పనులను ఆయన పరిశీలించారు. మరి కొద్ది రోజుల్లో ఈ పార్కు కాలనీ వాసులకు అందుబాటులోకి వస్తుందని మంత్రి వారికి తెలియజేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
మహాప్రస్థానం తరహాలో…
సనత్‌నగర్ ఈఎస్ఐ సమీపంలోని శ్రీ సత్య హరిశ్చంద్రఘాట్ శ్మశానవాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. నగరంలో మహా ప్రస్థానం తరహాలో ఈ శ్మశానవాటిక అభివృద్ధి జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. సనత్‌నగర్, ఎస్ఆర్నగర్ల నుంచే కాకుండా అమీర్‌పేట్, యూసుఫగూడ, ఎల్లారెడ్డిగూడలతో పాటు కూకట్పల్లి పరిసర ప్రాంతాల నుంచి కూడా అంత్యక్రియల కోసం వస్తున్నారని, ఈ శ్మశానవాటికను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే శ్మశానవాటికను సందర్శించి అక్కడ కల్పించాల్సిన ఆధునిక సదుపాయాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డి, బయో డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రమేశ్‌లతో పాటు జెక్కాలనీ రెసిడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సూర్యశంకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, సయ్యద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నేరియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పలు సమస్యలను విన్నవించగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్,అభిషేక్‌రెడ్డి, వెంకటేశర్లు, సుధాకర్‌గౌడ్, సైదులు, శేఖర్ తదితరులు ఉన్నారు.