మియాపూర్/కొండాపూర్, డిసెంబర్ 3 : ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడుత రెండు రోజులపాటు ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని 590 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రత్యేక శిబిరాలు ఆదివారం సైతం కొనసాగనున్నాయి. తొలి విడుత ప్రత్యేక నమోదు శిబిరాలను గత నెల చివరి వారంలో నిర్వహించగా.. తాజాగా 3, 4 తేదీల్లో నిర్వహించారు. 18 ఏండ్లు నిండిన వారంతా నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అర్హులని, వారు కాలనీల్లోనే తమకు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు ప్రచారం చేపట్టారు.
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలో పోలింగ్ బూత్‌లలో బీఎల్వోలు తగు దరఖాస్తులతో అందుబాటులో ఉండగా.. ఓటర్లు నమోదుకు, మార్పులు చేర్పులకు కేంద్రాలను సందర్శించారు. నియోజకవర్గ ఓటు నమోదు అధికారి(ఈఆర్వో) వెంకన్న నాయక్, చందానగర్ డీసీ నందగిరి సుధాంశ్ తమ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లలో నమోదు ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులు, జాబితాలతోపాటు బీఎల్వోలు అందిస్తున్న సేవలను వారు తనిఖీ చేశారు. ఆదివారం సైతం ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని, ఓటర్లు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్వోలు ఆదివారం తమ పోలింగ్ బూత్‌లలో విధిగా అందుబాటులో ఉండాలని వారు స్పష్టం చేశారు.
కొండాపూర్‌లో..
శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను శనివారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న బీఎల్ఓను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 1-10 పోలింగ్ కేంద్రాల్లో 6 మంది కొత్తగా ఓటరు నమోదు చేసుకోగా, 6 మంది ఆధార్‌ను లింక్ చేసుకున్నారు. 7 మంది ఓటర్ల పేర్లు తొలగించగా, మరో 8 మంది ఓటరు కార్డులో కరెక్షన్ చేయించుకున్నట్లు డీసీ తెలిపారు. అర్హులైన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటర్లు ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎల్ సత్యనారాయణరెడ్డి, బీసీ దత్తు, ఎస్ఎఫ్ఏ కర్ణ, వర్క్ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, శానిటేషన్ సిబ్బంది పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదుపై అవగాహన
ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.