పేదోడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేందుకు సర్కారు అడుగులు వేస్తున్నది. సుస్తీలేని బస్తీలే లక్ష్యంగా పేదల ఇంటి ముంగిటే బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు ప్రతి 5వేల నుంచి 10వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు బస్తీ దవాఖానలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పహాడీషరీఫ్, ఆగస్టు 22: హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న జల్పల్లి మున్సిపాలిటీలో వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానలు అందుబాటులో లేవు. చాలాకాలంగా కాలనీ, బస్తీవాసులు ఇబ్బందులు పడ్డారు. గత పాలకులు ఏనాడూ పేదల ఆరోగ్యం.. వైద్యం పట్ల ఆలోచించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అందుబాటులో ఉండే విధంగా దవాఖానలు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
పేద ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. పేద ప్రజలు నివాసముంటున్న కాలనీలు, బస్తీల్లోనే వైద్య సేవలందించేందుకు బస్తీ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగానే అత్యధికంగా పేదలు నివాసముంటున్న జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో పహాడీషరీఫ్, శ్రీరామకాలనీ, వాది సాలహీన్, వాది ఏ ముస్తఫా, కొత్తపేట, ఎర్రకుంటలో ఒక్కొక్కటి చొప్పున ఆరు బస్తీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయి.
మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే వాది ఏ సాల్హీన్లో బస్తీ దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేశారు. శ్రీరామకాలనీలో బస్తీ దవాఖాన ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. మిగతా చోట్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు తెలిపారు. బస్తీ దవాఖానలు పూర్తయినచోట అవసరమైన సిబ్బందిని త్వరలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఏర్పాటువుతున్న బస్తీ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట కల్పించనున్నారు.
వాది ఏ సాల్హీన్ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నది. అత్యధికంగా నిరుపేదలు నివాసం ఉండే కాలనీ ఇది. చిన్న పాటి అనారోగ్యానికి గురైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక, ప్రైవేట్ దవాఖానలో చూయించుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాతే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో ఇన్నాళ్లకు బస్తీ దవాఖాన ఏర్పాటయ్యింది. చాలా హర్షించతగిన విషయం. కాలనీ వాసులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తన వార్డులో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు.
– శంషోద్దీన్, 10వ వార్డు కౌన్సిలర్