మియాపూర్, ఆగస్టు 22 : ప్రజల సౌకర్యమే ధ్యేయంగా లక్షలాది నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మౌలిక వసతులు, అభివృద్ధి పనులతో డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీనగర్, ఇంద్రనగర్, ఆర్బీర్ కాంప్లెక్స్ కాలనీలలో రూ.1.82 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలన్నింటా రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో అధిక నిధులు మంజూరు చేయించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. నిర్మాణ పనులలో నాణ్యతను పక్కాగా పాటించాలని, అధికారులు ఎప్పటికపుడు తగు పర్యవేక్షణ చేపట్టి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
కాలనీల నుంచి ప్రధాన జాతీయ రహదారులకు సులువుగా చేరుకునేలా లింక్ రోడ్లను విరివిగా నిర్మిస్తున్నట్లు తద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని గాంధీ తెలిపారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అనునిత్యం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గంగాధర్‌రావు, గోపాల్‌రావు, ప్రతాప్‌రెడ్డి, మహేందర్, రఘునాథ్, శ్రీనివాస్, ఖాజా, వజీర్, రోజా, సుప్రజ, వరలక్ష్మి, రాజుగౌడ్, నర్సింగ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్ శిల్ప పార్కుకు కాలనీకి చెందిన రామకృష్ణ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.90 వేల ఆర్థికసాయం నిధుల మంజూరు పత్రాలను విప్ గాంధీ సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, కాశీనాథ్, శ్రీనివాస్, అల్లం మహేశ్, అంజలి పాల్గొన్నారు.