
కందుకూరు, జనవరి 17: స్వరాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. పేదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కూతుళ్ల పెండ్లీలకు పేదోళ్ల కంటతడి పెట్టొద్దంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ రెండు పథకాల ద్వారా మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత రూ.51వేల ఆర్థిక సాయం అందించింది. 2017- 2018లో 51వేల సాయాన్ని రూ, 75,116కు పెంచింది. నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో 2018 మార్చిలో రూ, 1,00,116 కు పెంచి ఆడ బిడ్డలున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇచ్చింది. కుల మతాలకతీతంగా ఈ పథకాన్ని వర్ధింపజేస్తుండటంతో అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలం పరిధిలో ఇప్పటి వరకు 991 మంది దాదాపుగా రూ. 10కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్ పథకం ద్వారా లబ్ధిపొందారు.
అర్హులందరికీ మంజూరు..
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న పేదింటి ఆడపడుచుల దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. పెండ్లి చేసుకున్న దంపతులకు రూ.1,00,116లను మంజూరు చేస్తున్నాం. మండల పరిధిలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల 991 మంది పేదింటి ఆడబిడ్డలకు రూ.10కోట్లు అందజేశాం. మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం.
పేదింటి ఆడపడుచులకు దేవుడు కేసీఆర్..
రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉండే ఆడపడుచులకు సీఎం కేసీఆర్ దేవుడు. ప్రభుత్వ లక్షా నూర పదహారు రూపాయలను అందజేస్తుంది. అప్పులు చేయకుండా ఆడ బిడ్డల పెండ్లీలు సాఫీగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటారు.