ఖైరతాబాద్, జనవరి 16 : పండుగలు మన సంస్కృతికి చిహ్నాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని పీవీ నరసింహారావు మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద కైట్ ఫెస్టివల్లో మంత్రి పాల్గొని స్వయంగా పతంగులను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ ఉత్సాహంగా మారిపోతుందన్నారు. తెలుగు రాష్ర్టాలు, ప్రపంచంలోని తెలుగు వారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. చిన్నప్పుడు పతంగులను, మాంజాను స్వయంగా తయారు చేసుకునేవారమని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. విదేశీ కల్చర్ వచ్చిన తర్వాత పండుగల ప్రాధాన్యత తగ్గిందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై చిన్నప్పటి నుంచే బోధించాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాడి పంటలతో రైతులు, సంక్షేమ ఫలాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారని, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో సాగు, తాగునీరందుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శైలెందర్, పవన్, మహేశ్ యాదవ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
నరసింహారావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయా రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పతంగులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్ యాదవ్, కరాటే రమేశ్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.