సైదాబాద్, అక్టోబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలె క్టర్ అనుదీప్ మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. నల్గొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆర్వో కార్యాలయంతో పాటు వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఫంక్షన్హాల్లో బీఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్)లు, సూపర్వైజర్ల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్దేశించిన ఓటర్లు దాటితే ఆగ్జలరీ కేంద్రాలను ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మలక్‌పేట ఆర్వో వెంకట ఉపేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డీసీ జయంత్, సైదాబాద్ తాసీల్దార్, ఏఆర్వో జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులు పాటు పోలింగ్ అధికారులు, సహాయ అధికారులకు మలక్‌పేట ముంతాజ్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ డీసీ జయంత్ విలేకరులకు తెలిపారు. మలక్‌పేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల్లో డ్యూటీల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించటానికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో అక్రమాల నియంత్రణకు, ఉల్లంఘనలపై ఫిర్యాదులను స్వీకరించటానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 040-24540034 నంబర్ కేటాయించారు. ఎన్నికల్లో అక్రమాలు,అవకతవకలను వెలుగులోకి తేవడానికి ప్రజలు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.