జీడిమెట్ల, ఆగస్టు 22: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. పరిశ్రమలోని కెమికల్ డ్రమ్ములు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఏడుగురు కార్మికులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. సుమారు 10 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.12 కోట్ల ఆస్తినష్టం సంబవించింది. నాలుగు అగ్నిమాపక వాహనాలు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడ శ్రీ వేంకటేశ్వర కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని శ్రీధర ల్యాబరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో సోమవారం సుమారు 17మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో కార్మికులు రియాక్టర్ వద్ద రసాయనాల మిశ్రమాన్ని కలుపుతుండగా వైఫర్లు పనిచేయకపోవడంతో రియాక్టర్ ఒత్తిడికి గురై భారీ శబ్దంతో పేలింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ సంఘటనలో పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
కంపెనీలో 15 రియాక్టర్లు ఉండగా ఒక రియాక్టర్ పేలడంతో పాటు కంపెనీ అవరణలో ఉన్న సిలిండర్లు, రసాయన డ్రమ్ములకు మంటలు అంటుకొని భారీ శబ్దాలతో పేలాయి. ఈ క్రమంలో కంపెనీ అవరణంలో పార్కు చేసిన సుమారు 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక వాహనాల సహయంతో 5 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.12 కోట్ల మేరా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ ప్రమాదంలో జమీర్ (36), నర్సింహరావు (45), శంకర్ (26) కార్మికులకు తీవ్రంగా గాయాలు కాగా.. లక్ష్మీనారాయణ, ప్రవీణ్, కృష్ణారెడ్డి, నర్సింహచారిలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. జమీర్, నర్సింహరావు, శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బాలానగర్ జోన్ డీసీపీ సందీప్ గోనె, బాలానగర్ ఏసీపీ గంగారాం, కూకట్పల్లి డివిజన్ అగ్నిమాపక అధికారి బి.సుధాకర్‌రావు, అసిస్టెంట్ డిప్యూటీ అగ్నిమాపక అధికారి సైదులు, జీడిమెట్ల సీఐ ఎం.పవన్, జీడిమెట్ల అగ్నిమాపక అధికారి సుభాష్‌రెడ్డి, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పీసీబీ అనలిస్టు రాకేశ్ పరిశీలించారు.