Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 13 : అవసరాల నిమిత్తం ఇంట్లో పనికి కుదుర్చుకుని.. అన్నం పెట్టి.. జీతం ఇస్తే… చివరకు తిన్నింటి వాసాలనే లెక్కబెట్టడమే కాదు… అవసరమైతే ఉపాధి కల్పించిన వ్యక్తినే హతమార్చేందుకూ వెనుకాడని ఓ ఘరానా ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. రెండు రోజుల కిందట హిమాయత్‌నగర్ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీని 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు… ఏడాది కిందటి దోమలగూడలోని వృద్ధురాలి హత్య కేసును సైతం ఈ సందర్భంగా ఛేదించడం విశేషం.
కుమార్తె పెళ్లి సందర్భంగా పనుల్లో సాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో పనికి పిలిపిస్తే యజమాని ఇంట్లో భారీ చోరికి పాల్పడిన కరుడుగట్టిన నేరస్థుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం ప్రముఖ ఆయిల్ వ్యాపారి రోహిత్ కేడియా నివాసంలో కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు, నగదు చోరీ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న కేడియా గ్రూప్ సంస్థ అధినేత రోహిత్ కేడియా కుమార్తె పెళ్లి కోసం ఐదు రోజుల కిందట కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి దుబాయి వెళ్లారు. కాగా ఈ నెల 11న ఉదయం రోహిత్ కేడియా సంస్థలో పని చేస్తున్న అభయ్ కేడియా అనే వ్యక్తి యజమాని ఇంటికి వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉండటం కనిపించింది. దీంతో లోపలికి వెళ్లి చూడగా అల్మారాలో ఉండాల్సిన పెద్ద మొత్తంలోని ఆభరణాలు, వజ్రాలు, నగదు, విదేశీ కరెన్సీ కనిపించలేదు. దీంతో వెంటనే అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన సొత్తు మాయమైందని, యజమాని కుటుంబసభ్యులు వచ్చి చూస్తేగానీ చోరీ అయిన మొత్తంపై ఇంకా స్పష్టత వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలతో పాటు ఇతర ఆధారాలను సేకరించి చోరీకి పాల్పడిన వారిని బీహార్‌లోని మధుబన్ జిల్లా బిరౌల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మోల్హూ ముఖియా అలియాస్ మనోజ్ ముఖియా(35) అనే పాత నేరస్థుడితో పాటు అదే ఇంట్లో పనిచేస్తున్న కుక్ సుశీల్ ముఖియా(29). కోల్‌కతాకు చెందిన పనిమనిషి బసంతి అర్హి (40) అని చివరకు తేలింది.