సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జూలై నెలలో నగరంలో నిర్వహించనున్న మొహర్రం ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో షియా కమ్యూనిటీ మతపెద్దలు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మొహర్రం సంతాప ఊరేగింపులో పాల్గొనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన వాహన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడతామని తెలిపారు. ఊరేగింపునకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, సౌకర్యాలపై షియా కమ్యూనిటీ మతపెద్దలతో పాటు అధికారుల నుంచి కమిషనర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశానికి సౌత్‌జోన్ డీసీపీ స్నేహామెహ్రా, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, మీర్జుల్ఫేకర్ అలీ, డాక్టర్ మౌలానా నిస్సార్ హుస్సేన్, నజబ్ అలీషాఖ్, ముస్తఫా అంజుమన్, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.