CV Anand | దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రజలు భయపడవద్దని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ప్రజలు ఫేక్ వార్తలను నమ్మి భయపడవద్దని అన్నారు. పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ మాక్‌డ్రిల్‌ను సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. మాక్ డ్రిల్ అనంతరం సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సాయంత్రం 4 గంటలకు మాక్‌డ్రిల్ నిర్వహించామని సీవీ ఆనంద్ తెలిపారు. రెండు నిమిషాల పాటు సైరన్ మోగించి అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లుగా మాక్‌డ్రిల్ చేశామని చెప్పారు. దాడులు జరిగితే తీసుకునే చర్యలు చేసి చూపించామని అన్నారు. అగ్నిమాపక, వైద్య సిబ్బంది చేపట్టే చర్యలపై మాక్‌డ్రిల్ నిర్వహించామని అన్నారు. అన్ని శాఖల అధికారుల పనితీరు, స్పందన ఎలా ఉందో ఈ మాక్‌డ్రిల్స్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పురపాలక, పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యుత్, రవాణా, ఇతర శాఖల వారంతా ఆయా ప్రాంతాలకు తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టారన్నారు.
క్షతగ్రాతులను ఆస్పత్రులకు తరలించే విధానం, మంటల్ని అదుపు చేయడం వంటి చర్యలు ఈ మాక్‌డ్రిల్‌లో చేపట్టామని సీవీ ఆందన్ తెలిపారు. ఫైరింజన్లు, అంబులెన్స్ రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారని అన్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు ఆస్పత్రులకు స్ట్రెచర్లపై తరలించారని అన్నారు. ఇదంతా ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు సన్నాహక చర్యలు మాత్రమేనని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ శాఖలు ఏవిధంగా భాగస్వామ్యం అవుతాయో మాక్‌డ్రిల్ ద్వారా చేశామని చెప్పారు. దీంట్లో కూడా కొన్ని లోపాలు జరిగాయని అన్నారు. జరిగిన లోపాలను సమీక్షించుకుని మరింత మెరుగ్గా పనిచేస్తామని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధత అవసరమో వాటిని మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రజల్ని కోరారు. ఫేక్ వార్తలను నమ్మి భయపడొద్దని సూచించారు. ఏ సహాయం కావాలన్నా 112కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.