సుల్తాన్‌బజార్, డిసెంబర్ 5: డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడమే కాకుండా యువత పెడదారిన పట్టకుండా అడ్డుకట్ట వేసేలా నగర పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం డిస్పోసల్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కమిటీ ఆధ్వర్యంలో గోషామహల్ పోలీస్ స్టేడియంలో పట్టుకున్న మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీ మాట్లాడుతూ.. పట్టుకున్న మాదకద్రవ్యాలను మళ్లీ ఎక్కడ వినియోగించకుండా నగర శివారులో ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. సుమారు 208 కేసుల్లో రూ.7.50కోట్ల విలువజేసే మాదకద్రవ్యాలను డిస్ట్రాయిడ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా.. జనవరి నుంచి జూన్ వరకు 118 కేసుల్లో రూ.3 కోట్ల 8లక్షల 14వేల డ్రగ్స్‌ను ఇది వరకే ధ్వంసం చేశామన్నారు. గత మూడేండ్లలో 1200 కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నారన్నారు. యువత చెడు పోకడలకు అడ్డుకట్ట వేయడంతోపాటు వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నైజీరియన్లను పట్టుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు.
హైదరాబాద్ సిటీ పోలీస్, టీజీనాబ్ల సంయుక్తాధ్వర్యంలో డ్రగ్స్‌పై జల్లెడ పట్టడంతో డ్రగ్స్ విక్రయాలు, వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో టీజీనాబ్ ధ్వంసం చేయబోయే రూ.7.50 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు 21490 కిలోల గంజాయి, 3.8 కిలోల మహకాల్ డ్రగ్స్, 12,669 ఎంఎల్ లీటర్ల హాషిష్ ఆయిల్, 540 అల్ఫ్రాజోలం టాబ్లెట్స్, 19.34 గ్రాముల కొకైన్, 4 ఎల్ఎస్డీ బాటిల్లు, 177.75 గ్రాముల ఎండీఎంఏ, 70 గ్రాముల ఓపిఎం తదితర మాదకద్రవ్యాలను ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నిబంధనలను పాటిస్తూ సీజ్ చేసి ధ్వంసం చేస్తున్నట్లు ఆయన వివరించారు. డీసీపీ డీడీ, డిస్పోసల్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కమిటీ చైర్మన్ ఎన్.శ్వేత, అడిషనల్ డీసీపీ మనోహర్, డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్తోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.