సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): అంగన్వాడీ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సీపీడీఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేయాలని సూచించారు. పోషకాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
కలెక్టరేట్లో గురువారం సమగ్ర శిశు అభివృద్ధి ఐసీడీఎస్ సేవలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ సెంటర్లలో తాగునీరు, టాయిలెట్ల లాంటి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వసతులు లేని వివరాలు తమకు అందించాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ గ్రోత్ మానిటరింగ్ రిపోర్ట్‌ను ఇవ్వాలని కోరా రు. వయస్సుకు తగ్గట్టు లేని పిల్లల వివరాలు తీసుకుని నివేదిక ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ అక్వేశ్వరరావు పాల్గొన్నారు.