హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో పంపింగ్‌తో పాటు గ్రావిటీ మెయిన్స్ నిర్వహణ కోసం రూ.20.57 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని జలమండలి ఎండీ గత ఏడాది సెప్టెంబరు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
మరుసటి రోజు రెండు వ్యవస్థల్లోని సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ పంపింగ్ స్టేషన్ల నిర్వహణను 28.20 కోట్లతో చేపట్టేందుకు టెండర్లకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారు. అదేవిధంగా ఈ ఏడాది మే 7న రెండు పథకాల్లోని నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ టెండర్లను రూ.20.10 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ మేరకు గత నెల 24న ప్రభుత్వ కార్యదర్శి (పురపాలక శాఖ) ఇలంబర్తి జీవో ఆర్టీ 260, 261, 262 జారీ చేశారు. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవి.
ఉత్తర్వులు వచ్చిందే తడవు… తూచ్! ఇలా వద్దు!! మూడు వ్యవస్థల నిర్వహణను ఒకే కంపెనీకి ఇచ్చేలా ఒక టెండరు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు. రేపోమాపో ఆ మేరకు ఉత్తర్వులు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దశాబ్దాల నుంచి పకడ్బందీగా కొనసాగుతున్న విధానాన్ని జలమండలి ఎందుకు మార్చుతుంది? ప్రధానంగా తాము పంపిన ప్రతిపాదనలకు భిన్నంగా అధికారులు మళ్లీ ఎందుకు ప్రతిపాదనలు పంపారు? గతంలో కృష్ణా మంచినీటి పథకం నిర్వహణపై జరిగిన వర్క్ తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో గుత్తాధిపత్యం (మోనోపొలీ) ఉండొద్దనే సిఫార్సులకు విరుద్ధంగా ఇప్పుడెందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇదీ ప్రస్తుతం జలమండలి వర్గాల్లో జరుగుతున్న చర్చ.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర నీటి సరఫరాలో 80 శాతం వరకు సేవలందిస్తున్న కృష్ణా, గోదావరి మంచినీటి పథకాల్లో నిర్వహణ అనేదే అత్యంత కీలకం. నీటి లభ్యత మినహా మిగతా అంతా మానవ వనరులతో కూడిన యంత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి రెండు మంచినీటి పథకాల నిర్మాణ సమయంలోనే స్కాడా (పర్యవేక్షక నియంత్రణ, డాటా సేకరణ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అంచనా వ్యయంలోనే కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదే వ్యవస్థ అందుబాటులో ఉంటే ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కూర్చుని వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి వస్తున్న కృష్ణా, గోదావరి జలాల సరఫరా వ్యవస్థల్ని పర్యవేక్షించే సాంకేతిక వెసులుబాటు దక్కేది.
కానీ వివిధ కారణాలతో నేటికీ రెండు పథకాల్లోనూ స్కాడా వ్యవస్థ అనేదే లేదు. దీంతో నిర్వహణ యంత్రాంగం, జలమండలి ఇంజినీర్లు ప్రతీ క్షణం అప్రమత్తంగా పర్యవేక్షిస్తే తప్ప నగరానికి నీటి సరఫరా అనేది సాఫీగా జరగదు. పైగా కృష్ణాలో 114 కిలోమీటర్ల మూడు వరుసల పైపులైన్లు, గోదావరిలో 188 కిలోమీటర్ల పైప్‌లైన్ ఉంది. కోటి మందికి పైగా దాహార్తిని తీర్చే జలమండలి నీటి శుద్ధి వ్యవస్థకు గతంలో ఐఎస్వో అవార్డులు దక్కిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నీటి శుద్ధి… పంపింగ్, సరఫరా… విద్యుత్ పంపు, సబ్స్టేషన్లు… ఇలా మంచినీటి సరఫరా అనేది మూడు భిన్నమైన వ్యవస్థలతో ముడిపడి ఉన్నందునే దశాబ్దాల నుంచి నిర్వహణ బాధ్యతల్ని ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న కంపెనీలకు టెండర్ల ద్వారా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జలమండలి అందుకు భిన్నమైన విధానాన్ని ఎంచుకోవడంపై ఇంజినీరింగ్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒక కంపెనీ గుత్తాధిపత్యంలో రెండు మంచినీటి పథకాల్లోని మూడు భిన్నమైన వ్యవస్థల్ని ఉంచడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో కృష్ణా మంచినీటి పథకం నిర్వహణపై జరిగిన అనేక వర్క్ నిర్వహణ ప్రక్రియలపై సుదీర్ఘమైన సాంకేతిక చర్చలు జరిగాయి.
అందులో భాగంగా నిర్వహణ అనేది మోనోపొలిగా ఉండొద్దనే సూచనలు వచ్చాయి. కానీ ఇప్పుడు జలమండలి అధికారులు ఒక కంపెనీకి కట్టబెట్టేందుకు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారనేది బహిరంగ రహస్యం. దీని ద్వారా పర్యవేక్షణ కొరవడటమే కాకుండా ఇది సబ్ కాంట్రాక్టులకు దారి తీసే ప్రమాదముందని సీనియర్ ఇంజినీర్లు చెబుతున్నారు. తద్వారా రికార్డుల్లో ఒక కంపెనీ పేరుంటే, నిర్వహణలో మరో కంపెనీ ఉంటుందని, తద్వారా బాధ్యత అనేది నల్లపూసగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.