హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ( Alert ) ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి బయటకు రావద్దని కోరారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం, తీగలు తెగిపడటం, వరద నీరు నిలిచి పోవడం, చెట్లు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ 21111111, ఫోన్ : 040-23225397కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్లపై నీటితో నిండిన గుంటలు ఉండటం, జారిపడటం వంటివి జరిగే అవకాశాలు ఉన్నందున వాహనదారులు డ్రైవింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జీహెచ్ఎంసీ (GHMC ) , వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చే ఫిర్యాదులపై సంబంధిత క్షేత్రస్థాయిలోని అధికారులకు తక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఓపెన్ నాలాలు పొంగి వరదనీరు సమీపంలోని కాలనీలు, ఇండ్లలోకి చేరకుండా పర్యవేక్షణ చేయాలని వెల్లడించారు. ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, బస్తీలలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా, సాఫీగా నీటి ప్రవాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.