సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రేటర్ గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకొనేలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ సమావేశాలు, తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీటింగ్లో నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు కలిసి సన్నాహక సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 4వేల మంది సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. కాగా, పార్టీ అధినేత, కేసీఆర్ ప్రసంగంపై జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ బహిరంగ సభకు గ్రేటర్ శ్రేణులు కదులుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఎల్కతుర్తి సభ ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. నియోజకవర్గాలను గులాబీ మయం చేయడంతో పాటు పెద్ద ఎత్తున వాల్ పెయింటింగ్ రాయించారు. పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఎక్కడ చూసినా ‘కేసీఆర్ జిందాబాద్’ ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ ‘చలో వరంగల్’ 25 ఏండ్ల పండుగను జయప్రదం చేయండి అన్న కొటేషన్లు దర్శనమిస్తున్నాయి.మరోవైపు పార్టీ ఆవిర్భావ సభ వరంగల్లో నిర్వహిస్తున్న సందర్భంగా కవులు, కళాకారులు రాసి పాడిన పాటలు నగరమంతా హోరెత్తిస్తున్నాయి.
చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ జరగనున్నది. ఈ సభలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఒక మంచి మెసేజ్ ఇవ్వనున్నది. ఇప్పటికే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సభపైనే చర్చ జరుగుతున్నది. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
– మాగంటి గోపీనాథ్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
స్వరాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల అద్భుతమైన పాలనను అందించారు. మొన్నటి వరకు సుభిక్షంగా ఉన్న తెలంగాణ నేడు ఆగమైపోతున్నది. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమమైతే చేశామో..అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
– ఆవుల రవీందర్రెడ్డి, కార్పొరేటర్
పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి తర్వాత ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ పదేండ్లు వెనకబడి పోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారు. రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు
– ఎర్రబెల్లి సతీష్రావు , బీఆర్ఎస్ నేత