రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు లభించకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ఈ రెండు జిల్లాలకు స్థానం లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. రెండోసారైనా తమకు అవకాశం లభిస్తుందని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసి ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. అలక వహించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీని కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చాలంటే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఎంతో ఆశించామని వారు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మం త్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పలువురు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అమాత్యా యోగం దక్కకపోవడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. బుజ్జగించేందుకు ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తదితరులు ఆయన ఇంటికెళ్లారు.
మంత్రి పదవి కోసం ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనూ పైరవీలు చేశారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించారు. మంత్రివర్గంలో స్థానం కోసం కులమే అడ్డు అనుకుంటే రాజీనామా చేసి బడుగు, బలహీన వర్గాలనైనా గెలిపిస్తానని అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు.
బల్మూర్ వెంకట్‌కూ నిరాశ
హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తీవ్రంగా పైరవీలు చేశారు. మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశించగా.. ఆయన ఆశలు కూడా ఫలించలేదు.
మరోసారి ఆశాభంగం
మొదటి మంత్రివర్గ విస్తరణలోనే తనకు స్థానం లభిస్తుందని మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవకాశం లభించలేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఆయన ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అత్యంత సన్నిహితుడైన బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ద్వారా ప్రయత్నాలు చేశారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆయన పేరు జాబితాలో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
రెండు జిల్లాలపై కనికరం చూపని కాంగ్రెస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలోనూ ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. కాంగ్రెస్ ఈ రెండు జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్‌సిటీ, ఇతర పరిశ్రమలు, ఐటీ సంస్థలు వస్తున్నా జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కడంలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో గత బీఆర్ఎస్ హయాంలో నలుగురు మంత్రులుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికి కూడా స్థానం కల్పించలేదు. తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయలాంటి ఈ రెండు జిల్లాలను కాంగ్రెస్ విస్మరిస్తున్నదనే ఆరోపణలున్నాయి.